హారతికి బోయపాటిని బాబు వదల్లేదు

Update: 2016-07-28 07:00 GMT
ఏడాది కిందట గోదావరి పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత పోటాపోటీగా నిర్వహించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్కరాల నిర్వహణ రేసులో అందరి కంటే ముందు ఉండాలన్న తపనతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా ప్రత్యేక దృష్టి సారించారు. అయితే.. ఊహించని రీతిలో తొలి రోజున రాజమండ్రిలో తొక్కిసలాట చోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున యాత్రికులు మరణించటంతో ఏపీ సర్కారుకు ఇదో భారీ షాక్ గా మారింది.

ఇదంతా కూడా.. ఒక ఛానల్ లో కార్యక్రమంలో భాగంగా షూటింగ్ ఏర్పాటు చేశారని.. అందుకే యాత్రికుల్ని నిలిపివేసి.. రద్దీ పెరిగిన తర్వాత ఒక్కసారిగా అనుమతించటంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుందున్న విమర్శలు ఏపీ ముఖ్యమంత్రిపై వచ్చాయి. గోదావరిపుష్కరాలను పురస్కరించుకొని సినీ దర్శకులు బోయపాటి శ్రీను నేతృత్వంలో హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

భక్తుల వెతలు పట్టకుండా.. ప్రచారం కోసమే చంద్రబాబు తపిస్తున్నారన్న మాట ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల కోసం వీలైనంత తక్కువ హడావుడి ఉంటుందని భావించారు. అయితే.. అందుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో మాదిరే.. కృష్ణా పుష్కరాల్లో కూడా హారతి కార్యక్రమం ఏర్పాటు చేయటం.. దాన్ని పర్యవేక్షణ బాధ్యతల్న సినీ దర్శకులు బోయపాటి శ్రీను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాబు తాజా నిర్ణయం చూసినప్పుడు.. గోదావరి పుష్కరాల సందర్భంగా బోయపాటి శ్రీనుతో నిర్వహించిన హారతిపై విమర్శలేవీ చంద్రబాబుపై పెద్దగా ప్రభావం చూపించలేదన్న భావన వ్యక్తమవుతోంది. కార్యక్రమాల్ని భారీతనంతో నిర్వహించటం తప్పు లేదు కానీ.. ఆ హడావుడిలో కీలకమైన అంశాల మీద దృష్టి పెట్టకుండా ఉంటేనే సమస్య అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News