ప‌వ‌న్ లాగే ద‌క్షిరాది సెంటిమెంట్‌ ను కెలికిన కేటీఆర్‌

Update: 2017-10-09 09:51 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు రాష్ట్ర ఐటీ - పరిశ్రమలు - పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ ఒక‌టి చర్చ‌కు పెట్టారు. దేశంలో ప‌లు రాష్ర్టాల్లో ఉన్న ఉత్త‌రాది-ద‌క్షిణాది సెంటిమెంట్‌ ను కేటీఆర్ కెలికారు.గ‌తంలో ఉత్త‌రాది-ద‌క్షిణాది ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గాల‌న్న జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి డిమాండ్‌ నే కేసీఆర్ ప్ర‌స్తావించారు. అందులోనూ బీజేపీ మిత్ర‌ప‌క్ష పార్టీలు - ఆ పార్టీతో పొత్తు లేని రాష్ర్టాల్లో జ‌రుగుతున్న అభివృద్ధి గురించి కేటీఆర్ ప్ర‌స్తావించారు. ఎన్డీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలపై - దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని - ఇది మంచి పద్ధతి కాదని కేటీఆర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ఇచ్చిన హామీలు కూడా అమలుకాలేదని గుర్తుచేశారు. దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి విషయంలో వివక్ష ప్రదర్శిస్తుండటం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై స్పందించారు.

దేఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌ పై ఎక్కువగా దృష్టి సారించి - దక్షిణాదిలోని హైదరాబాద్ - బెంగళూరు - చెన్నై ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ కారిడార్లను పట్టించుకోవటం లేదంటూ కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయంలో పొరుగున ఉన్న కర్ణాటక - తమిళనాడు రాష్ర్టాలతో కలిసి పారిశ్రామిక - ఇతర అంశాల విషయంలో కేంద్రం తీరుపై చర్చించే అవకాశం ఉందా? అని సదరు మీడియా సంస్థ ప్రశ్నించగా.. ``అభివృద్ధి కోణంలో ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ దాటి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తాజాగా ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ విషయంలో మరోమారు అదే కారిడార్‌ ను ఎంచుకున్నారు. ఉత్తరాది లాగే దక్షిణాది సైతం దేశాభివృద్ధికి సహకరిస్తున్న అంశాన్ని గమనించాలి. కేంద్ర ప్రభుత్వం మా ఆవేదనలను పరిగణనలోకి తీసుకోకపోతే ఇరుగు పొరుగున ఉన్న దక్షిణాది రాష్ర్టాలతో ఈ విషయంపై చర్చించాలని మా ముఖ్యమంత్రి దృష్టికి తప్పకుండా తీసుకుపోతాం`` అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ర్టాలకు ఇస్తున్న నిధులు పెరిగినప్పటికీ - పక్షపాతం కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవటం లేదని కేటీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన కేంద్రం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని నిలబెట్టుకోలేదని కేటీఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్ పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ, ఇంకా పెండింగ్‌ లోనే ఉంచారని చెప్పారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి కీలకమైన ఐటీఐఆర్ జోన్‌ ను నోటిఫై చేయటంలో కేంద్రం విఫలమైందని చెప్పారు. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేస్తున్నట్టు ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటులో ప్రకటించినా - ఆచరణ రూపం దాల్చలేదని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ర్టాల్లో బీజేపీ విస్తరణ ప్రణాళికలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ``కలలు కనటంలో తప్పులేదు. బీజేపీ నేతలు తమకు తాము జాతీయ పార్టీగా భావించుకుంటున్నప్పటికీ, ఒక్క కర్ణాటక మినహా దక్షిణాదిలోని నాలుగు రాష్ర్టాల్లో ఆ పార్టీకి ఉన్న బలం తక్కువే. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సీపీఐకి జాతీయ పార్టీ గుర్తింపు ఉన్నప్పటికీ దేశంలో ఆ పార్టీ ప్రభావం లేదు`` అని ప‌రోక్షంగా బీజేపీని ఎత్తిపొడిచారు.
Tags:    

Similar News