సినిమా డైలాగ్ స‌రే.. గ‌తం మాటేంది కేటీఆర్?

Update: 2018-07-31 04:48 GMT
అధికారం చేతిలో ఉండే అహంభావం ఆటోమేటిక్ గా ఆభ‌ర‌ణం అయిపోతుందేమో. అలాంటి వాటి జోలికి వెళ్ల‌కుండా ఉండ‌గ‌లిగే నేత‌లు అతి త‌క్కువ‌మందిలో ఉంటారు. అలాంటి జాబితాలో త‌మ పేరు ఉండాల‌ని టీఆర్ ఎస్ నేత‌లు ఎవ‌రూ కోరుకోరు. ఎంత‌సేప‌టికి త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై దునుమాడ‌టం.. వారిపై తీవ్రంగా విరుచుకుప‌డ‌ట‌మే త‌ప్పించి.. స‌క్ర‌మంగా మాట్లాడేదే ఉండ‌దు. తాజాగా మంత్రి కేటీఆర్ మాట‌లే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

త‌మ‌ను తాము గొప్ప‌గా చాటి చెప్పుకోవ‌టానికి కేటీఆర్ నోట సినిమా డైలాగులు వ‌స్తున్నాయి. అయితే.. ఆయ‌న త‌మ గ‌తాన్ని మ‌ర్చిపోతున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు వ‌ర్త‌మానం.. భ‌విష్య‌త్తు మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే నేత‌లు గతాన్ని మ‌ర్చిపోతుంటారు. కానీ.. ప్ర‌జ‌లు వాటిని అంత తేలిగ్గా మ‌ర్చిపోర‌న్న విష‌యాన్ని గుర్తుంచుకుంటే మంచిద‌న్న స‌ల‌హాను ఇస్తున్నారు.

ఇంత‌కీ ఇదంతా ఎందుకంటే.. త‌మ‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయ పార్టీల‌న్నీ జ‌ట్టు క‌ట్ట‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న వైనం మంత్రి కేటీఆర్ కు కోపాన్ని క‌లిగిస్తున్నాయి. వారిపై విరుచుకుప‌డుతున్న ఆయ‌న‌.. త‌న‌కున్న ఆగ్ర‌హాన్ని సినిమా డైలాగ్ తో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నాలుగేళ్ల కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌తిపక్షాలకు క‌డుపు మండుతోంద‌న్న మాట‌ను చెప్పిన కేటీఆర్‌.. త‌మ‌ను ఓడించేందుకు విప‌క్షాల‌న్నీ ఒక్క‌టై కూట‌మిగా ఏర్పాటు అవుతున్నాయ‌న్నారు.

సింహం సింగిల్ గా వ‌స్తుంద‌ని.. పందులే గుంపులుగా వ‌స్తాయంటూ సినిమా డైలాగ్ చెప్పి త‌న చుట్టూ ఉన్న వారిని ఉత్సాహ‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు.  రాజ‌న్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాల్లో హాజ‌రైన సంద‌ర్భంగా కేటీఆర్ నోట ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. డైలాగ్ అయితే బాగానే పేలింది కానీ.. గ‌తాన్ని అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోతున్నావా కేటీఆర్‌? అన్న మాట‌లే ఇప్పుడు ప‌లువురి నోట వినిపిస్తోంది.

అప్పుడెప్పుడో ముచ్చ‌ట ఎందుకు కానీ.. 2004.. 2009లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌త క‌ట్టాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయావా?  అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడైతే సింహం సింగిల్ మాట ఓకే కానీ.. మ‌రి గ‌తం సంగ‌తి ఏమంటావ్ కేటీఆర్ అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. ఏమో.. అప్ప‌ట్లో నే అమెరికాలో ఉన్నా.. నాకేం తెల్వ‌దన్న మాట మాత్రం చెప్ప‌కు చిన్న‌సారూ!


Tags:    

Similar News