త‌మ్ముడు అంటూ లోకేశ్ ను ఏసుకున్నాడు

Update: 2016-01-27 11:30 GMT
మైండ్ గేమ్ ఆడ‌టంలో టీఆర్ ఎస్ నేత‌ల త‌ర్వాతే ఎవ‌రైనా. గ్రేట‌ర్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వాడీవేడీ ప్ర‌చారం జ‌రుగుతున్న సంద‌ర్భంగా ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అనుస‌రిస్తున్న వైనం చూస్తే ఆయ‌న్ను అభినందించాల్సిందే. గ‌త కొద్దిరోజులుగా ప్ర‌చార బ‌రిలోకి దిగి.. తెలంగాణ అధికార‌ప‌క్షంపై సున్నితంగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు.. టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి లోకేశ్ ను ఓ రేంజ్‌ లో ఏసుకున్నారు కేటీఆర్‌.

లోకేశ్ ను త‌మ్ముడుగా సంబోధిస్తూ ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. గ్రేట‌ర్ ప‌గ్గాలు త‌మ‌కిస్తే హైద‌రాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తామ‌ని త‌మ్ముడు లోకేశ్ చెబుతున్నారని.. ముందు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని అభివృద్ధి చేసుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు. కేంద్రంలో ఉన్న మోడీ స‌ర్కారు నుంచి నిధులు తీసుకొచ్చి హైద‌రాబాద్ అభివృద్ధి చేస్తామ‌ని చెబుతున్న త‌మ్ముడు లోకేశ్‌.. మొద‌ట అమ‌రావ‌తి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే ప‌ని మీద దృష్టి పెడితే బాగుంటుంద‌ని చుర‌క‌లేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక ఉదాహ‌ర‌ణ చెబుతూ.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెళ్లార‌ని.. ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీ వ‌చ్చార‌ని.. ఆయ‌న త‌న‌తో పాటు త‌ట్టెడు మ‌ట్టి.. చెంబుడు నీళ్లు ఇచ్చి వెళ్లార‌ని.. ఎన్డీయే స‌ర్కారులో పార్ట‌న‌ర్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ తొలుత ఏపీ ప్ర‌జ‌ల అవ‌స‌రాల మీద దృష్టి పెడితే బాగుంటుంద‌న్నారు. ఏపీకి అవ‌స‌ర‌మైన నిధులు తెచ్చుకోలేని ఏపీ స‌ర్కారు.. హైద‌రాబాద్ కు నిధులు ఎలా తెస్తారంటూ ప్ర‌శ్నించారు. సొంత రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన నిధులు తెచ్చుకోవ‌టంలో విఫ‌ల‌మవుతున్న వారు.. ప‌క్కనున్న తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చి ఏం చేయ‌గ‌ల‌ర‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌ను చూసుకోవ‌టానికి తామున్నామ‌ని వ్యాఖ్యానించారు. మాట‌ల్లో పైచేయి సాధించేందుకు త‌మ్ముడు లోకేశ్ అంటూ సంబోధ‌న‌లోనే కేటీఆర్ తాను అనుకున్న ప‌నిని పూర్తి చేశార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News