రోడ్లపై గుంతల వద్ద కేటీఆర్ ఫొటోలు

Update: 2018-07-12 06:41 GMT
గుంతలతో నిండిన రోడ్లపై ప్రయాణం చేయలేక... ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేక హైదరాబాద్ ప్రజలు విసిగిపోతున్నారు. వర్షాకాలం రోడ్లపై గుంతల్లో పడి వాహనదారులు యాక్సిడెంట్లకు గురికాకుండా ఉండేందుకు అప్రమత్తం చేసేలా.. అదేసమయంలో ప్రజాప్రతినిధులకు వారి బాధ్యతను గుర్తు చేసేలా ఉభయతారకంగా ఉండేలా కొత్త ప్రయత్నం ప్రారంభించారు. ఈ ప్రయత్నం ఆయా రోడ్లపై వెళ్లేవారందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
    
హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లి - కేపీహెచ్‌ బీ కాలనీ - బాలాజీ నగర్ ప్రాంతాల్లో వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. భారీ గుంతలేర్పడ్డాయి. దీనివల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే.. ఈ గుంతల్లో నీరు నిలిచి దోమల విజృంభణా ఎక్కువైపోయింది. ఫలితంగా రోగాలబారిన పడుతున్నారు. తమ సమస్యలను అధికారులకు - ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పుకొన్నా ఫలితం లేకపోవడంతో విసిగి వేసారి అందరి దృష్టినీ ఆకర్షించేలా వినూత్నంగా ఓ పనిచేశారు.
    
స్థానికులు కాంగ్రెస్ నేతలకు ఈ సమస్యలు చెప్పడంతో వారు ఇలా కాదని.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ - స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల ఫొటోలను తెచ్చి ఆ గుంతల వద్ద పాతారు. దాంతో అక్కడ గుంతలున్నట్లు వాహనదారులకు తెలుస్తోంది. అదేసమయంలో ప్రజాప్రతినిధులకు వారి బాధ్యతను గుర్తుచేసినట్లూ అవుతోంది. మరి.. ఈ ప్రయత్నమైనా ఫలిస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News