బీజేపీపై కుమార‌స్వామి ఫైర్‌.. అధిరిపోయే రీజ‌న్‌!

Update: 2021-01-17 14:34 GMT
క‌ర్ణాట‌క‌లో త‌న ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి.. గ‌ద్దెనెక్కిన బీజేపీపై జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కుమార స్వామి వీలు చూసుకుని బీజేపీకి వాత‌లు పెడుతున్నారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేశారంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేయ‌డంతో రేయింబ‌వ‌ళ్లు ముఖ్య‌మంత్రి యడియూర‌ప్ప సీఎం కార్యాల‌యాన్ని విడిచి పెట్ట‌కుండా ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల్సి వ‌చ్చింది కొన్నాళ్ల కింద‌ట కుదిపేసిన వ‌ర‌ద భీబ‌త్సంపైనా.. ప్ర‌భుత్వాన్ని కుమార స్వామి ప్ర‌శ్న‌ల వ‌ర్షంతో త‌డిపేశారు. అప్పుడు కూడా య‌డియూ ర‌ప్ప‌కు సెగ‌లు పుట్టాయి. ఇక‌, ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌లు సెంటిమెంటుగా భావించే మాతృభాష‌ను ఆధారం చేసుకుని బీజేపీని ఏకేశారు.. కుమార‌స్వామి. అంతేకాదు.. అస‌లు ఇలా అయితే.. మీరు అధికారానికి కూడా దండ‌గే.. అని తేల్చి పారేశారు.

ఈ ప‌రిణామం.. బీజేపీని మ‌రిన్ని చిక్కుల్లోకి నెట్టేసింది. క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు త‌మ స్వ‌భాష‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు.  అన్ని విష‌యాల్లోనూ వారు క‌న్న‌డ‌నే వినియోగిస్తారు. అత్యవ‌స‌ర‌మైతే.. త‌ప్ప‌.. ఇంగ్లీష్ జోలికిపోరు. ఇక‌, హిందీ విష‌యాన్ని పెద్దగా ప‌ట్టించుకోరు. ఈ నేప‌థ్యంలోనే మాతృభాష ప‌రిర‌క్ష‌ణ చేసే రాజ‌కీయ పార్టీల‌వైపు ప్ర‌జ‌లు మొగ్గుతారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు..

సీఎం సిద్ధ‌రామ‌య్య‌.. మాతృభాష‌కు ప‌ట్టంగ‌ట్టార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికీ ఉంది. ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడే.. ప్ర‌భుత్వ జీవోలు, కార్యాల‌యాల్లోను క‌న్న‌డ భాష‌నే వినియోగించేలా చ‌ట్టం తీసుకువ‌చ్చారు. మొత్తంగా చూస్తే.. మాతృభాష‌కు-రాజ‌కీయ నేత‌ల‌కు-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య గొప్ప అనుబంధం ఏర్ప‌డిపోయింది.

ఇక‌, తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో కేంద్ర హోం శాఖ ప‌రిధిలో క‌ర్ణాట‌క‌లో ర్యాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ విభాగం ఏర్పాటు అవుతోంది. దీనికి గాను భారీ కార్యాల‌యం, వ‌స‌తి గ‌దులు, శిక్ష‌ణ ప్రాంతాల‌తో కూడిన నిర్మాణాల‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తాజాగా శంకుస్థాప‌న చేశారు. అయితే.. ఈ శంకుస్థాప‌న ఫ‌లకంలో వివ‌రాల‌ను.. కేవ‌లం హిందీ, ఇంగ్లీషు భాష‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

దీంతో దీనిని రాజ‌కీయంగా త‌న‌కు అవ‌కాశంగా మ‌లుచుకున్న జేడీఎస్ అధ్య‌క్షుడు, మాజీ సీఎం కుమార‌స్వామి.. అమిత్‌షా స‌హా రాష్ట్ర‌, కేంద్ర బీజేపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. `'కన్నడ భాషను ఎందుకు విస్మరించారో షా సమాధానం చెప్పి తీరాలి. భూమిని, భాషను రక్షించలేని వారికి పాలించే అధికారమే లేదు. కన్నడిగుల విషయంలో అమిత్‌షా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు.'' అంటూ కుమార స్వామి ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ధ్వజమెత్తారు.

కుమార‌స్వామి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి. బీజేపీ నేత‌లు స్థానిక భాష‌ను విస్మ‌రిస్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇది అంతిమంగా .. సీఎం య‌డియూర‌ప్ప మెడ‌కు చుట్టుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. లేక‌పోతే.. య‌డియూర‌ప్ప రాజ‌కీయాల‌కు కూడా మాతృభాష పెను ఇబ్బంది సృష్టించే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి కుమార‌స్వామికి మంచి మార్కులే ప‌డ్డాయి.
Tags:    

Similar News