లంచమివ్వడానికి బిచ్చమెత్తుతున్న రైతు

Update: 2018-12-20 08:12 GMT
లంచమిస్తే దేశంలో ఏపనైనా అవుతుంది.. ఇవ్వకపోతే రోజుల తరబడి తిరగాల్సిందే.. ఇక్కడో రైతును కూడా అష్టకష్టాలపాలు చేశారు అధికారులు.. కర్నూలు జిల్లాలో అధికారులకు లంచం ఇచ్చేందుకు భిచ్చమెత్తుకుంటున్న రైతు వ్యవహారం సంచలనంగా మారింది. తన భూమిని సమీప బంధువు లంచాలు ఇచ్చి ఆక్రమించుకుంటే అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని ఓ రైతు ఆక్రోషించాడు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో కర్నూలు జిల్లా కేంద్రంలో రైతు మన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు తన భార్య - ఇద్దరు పిల్లలతో కలిసి చేతిలో భిక్ష పాత్ర పట్టుకొని మెడలో ‘భూమిని దక్కించుకునేందుకు దానం చేయండి..’ అంటూ బ్యానర్ వేసుకొని అడుక్కోవడం మొదలుపెట్టాడు.

మన్యం వెంకటేశ్వర్లకు పశ్చిమగోదావరి జిల్లా మాధవరం గ్రామంలో 25 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని వెంకటేశ్వర్లు సమీప బంధువుకు కౌలుకు ఇవ్వగా.. అతడు తప్పుడు పత్రాలు సృష్టించి.. అధికారులకు లంచాలు ఇచ్చి తన పేరిట ఆక్రమించుకున్నాడు. ఈ విషయంపై అధికారులను సంప్రదించిన వేంకటేశ్వర్లకు డాక్యుమెంటు బంధువు పేరు మీద తయారయ్యాయని.. ఏ నిమిషంలోనైనా అతడికి అందజేస్తామని వారు సమాధానం ఇచ్చారు.

అధికారుల తీరుతో విసిగిపోయిన వెంకటేశ్వర్లు ఇలా బిచ్చమెత్తుతూ నిరసన తెలిపారు. కాగా వెంకటేశ్వర్ల ఆరోపణలపై కర్నూలు కలెక్టర్ ను మీడియా వివరణ కోరగా.. అది సివిల్ కేసు అని.. అధికారుల గురించి ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. భూమికి సంబంధించి కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని సూచించారు.


Tags:    

Similar News