బాబుకు సాష్టాంగపడతానన్న వైఎస్ ఆత్మ

Update: 2016-09-18 11:15 GMT
వైఎస్ ఆత్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ వైఎస్ ఆత్మ అంటే ఎవరో తెలుసు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తమిత్రుడు - నిత్యం వెన్నంటి ఉండి నడిపించిన సలహాదారు.. ప్రస్తుత కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావును వైఎస్ ఆత్మ అని అంటారన్న సంగతి తెలిసిందే. వైఎస్ మరణం తరువాత ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. వైఎస్ ను ఎవరు విమర్శించినా ఆయన ఊరుకోరు. అలాంటి కేవీపీ ఇప్పుడు వైఎస్ కు బద్ధ శత్రువు అయిన ఏపీ సీఎం చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానంటున్నారు. తన ఆత్మబంధువుకు శత్రువు అయిన వ్యక్తికి కేవీపీ ఎందుకు సాష్టాంగం పడతానంటున్నారో తెలుసా మరి.. చంద్రబాబు ఇటీవల ప్రకటించినట్లుగా 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తిచేస్తే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తానని కేవీపీ ప్రకటించారు. 2018 సరికి పోలవరం పూర్తి చేయడం అసాధ్యమని ఆయన అన్నారు.

కాంగ్రెస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ కోర్టుకు ఎందుకు వెళ్లిందో చెప్పాలని కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. పోలవరంపై ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కోర్టుకు వెళితే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే చంద్రబాబుకు సాష్టాంగనమస్కారం చేస్తానని అన్నారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టుల వెనుక ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. పోలవరం గురించి ప్రశ్నిస్తే రాక్షసులు లాగా అడ్డుపడి ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని అధికారపక్ష నాయకులు అంటున్నారని విమర్శించారు.

''కృష్ణా జిల్లావాసిగా.. ఆ రోజు పోలవరం ప్రాజెక్టుతో సంబంధమున్న ఒక వ్యక్తిగా నేను చెబుతున్నాను.. మా జిల్లాలో రైతాంగాన్ని రెచ్చగొట్టి - టీడీపీ కి సంబంధించిన రైతులతో కోర్టులో పిటిషన్లు వేయించి.. స్టేలు తీసుకువచ్చింది చంద్రబాబునాయుడు కాదా?"" అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచించాలి.. దాన్ని పూర్తిచేయాలి అన్న ధ్యాస చంద్రబాబుకు కానీ ఎన్డీయే ప్రభుత్వానికి కానీ లేదని కేవీపీ ఆరోపించారు.

Tags:    

Similar News