లగడపాటి చెప్పారు.. తమిళనాడులో కరుణానిధే..

Update: 2016-05-17 06:47 GMT
ఎన్నికల సర్వేల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు ప్రత్యేక స్థానముంది. ఆయన సర్వేలు లెక్క తప్పిన సందర్భమే లేదు. ఘనత వహించిన సంస్థల సర్వేల కంటే అత్యంత కచ్చితత్వంతో అవి నిజమవుతున్నాయి. ఇప్పటివరకు లగడపాటి సర్వేలు ప్రతిసారీ కరెక్టవుతున్నాయి. ఆ కారణంగానే ఆయనకు గతంలో ఆంధ్రా ఆక్టోపస్ అన్న బిరుదు కూడా ఇచ్చేశారు కొందరు. అలాంటి లగడపాటి రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొననప్పటికీ రాజకీయాలపై ఉన్న ఆసక్తిని మాత్రం లగడపాటి వదులుకోలేదు. నిత్యం వాటి చుట్టే తిరుగుతున్నారు. తాజాగా ఆయన తమిళనాడు ఎన్నికలపై సర్వే చేయించారు. ఆయన సర్వేలో డీఎంకేను విజయం వరిస్తుందని తేలింది.

తమిళనాడులో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై లగడపాటి పక్కా సర్వే చేయించారు. ఆయన సర్వేలోనూ రాజకీయ కురువృద్ధుడు - డీఎంకే చీఫ్ కరుణానిధే విజేత అని తేలింది. అయితే.. లగడపాటి కేవలం సీట్ల లెక్కలకే పరిమితం కాకుండా కాస్త విశ్లేషణ కూడా చేశారు. తమిళనాడులో ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ విధానానికి ఓటేసిన తమిళ తంబీలు ముందుగా వినిపించిన హామీల వైపే మొగ్గుచూపారట.  అన్నా డీఎంకే కంటే ముందుగా డీఎంకే రుణమాఫీపై హామీ ఇవ్వడంతో జనం అటే మొగ్గు చూపారని లగడపాటి సూత్రీకరించారు. మిగతా కొన్ని హామీలు కూడా రెండు పార్టీలూ ఇచ్చినా కూడా తొలుత కరుణ ఇవ్వడంతో జనం అటే మొగ్గు చూపారని తెలుస్తోంది.

గతంలో ఏపీలో దివంగత సీఎం ఎన్టీఆర్ వినిపించిన రూ.2లకే కిలో బియ్యం పథకానికి ఆకర్షితులైన ఓటర్లు ఆ తర్వాత అదే హామీని మరో దివంగత సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి ఇచ్చినా దానిని పట్టించుకోలేదు. ముందుగా హామీ ఇచ్చిన ఎన్టీఆర్ వైపే మొగ్గిన ఓటర్లు ఆ తరువాత కోట్ల రూ.1.95 కే కిలో బియ్యం ఇస్తానని ప్రకటించినా కూడా ఆయనవైపు కన్నెత్తి చూడలేదన్న చరిత్రను లగడపాటి సర్వే విశ్లేషణల్లో ప్రస్తావించారు.  మరి... రాజకీయాల్లో ఉన్నప్పుడు సర్వేలన్నీ నిజమైనట్లుగానే ఇప్పుడూ లగడపాటి సర్వే నిజమవుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News