చంద్ర‌బాబు ఒక రాబందు:ల‌క్ష్మీ పార్వ‌తి

Update: 2018-05-28 10:01 GMT
నేడు ఎన్టీఆర్ 95వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని నంద‌మూరి - నారా కుటుంబ‌స‌భ్యుల‌తో స‌హా ప‌లువురు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. మ‌హానాడు కు దూరంగా ఉన్న హ‌రికృష్ణ‌తో స‌హా క‌ల్యాణ్ రామ్ - జూనియ‌ర్ ఎన్టీఆర్ ....ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నివాళుల‌ర్పించారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ సతీమణి - వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కూడా అన్న‌గారికి అశ్రున‌య‌నాల‌తో నివాళుల‌ర్పింరాచు. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆమె నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన నారాచంద్ర‌బాబు నేడు ఆయ‌నకు నివాళుల‌ర్పించ‌డం హాస్యాస్పద‌మ‌న్నారు. నారా కుటుంబాన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలని ల‌క్ష్మీ పార్వ‌తి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ వారసుల్లో ఒకరికి  టీడీపీ పగ్గాలు అప్ప‌జెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్పిన అన్న‌గారు స్థాపించిన టీడీపీని....ఆత్మ‌వంచ‌న పార్టీగా మార్చిన చంద్ర‌బాబు...కాంగ్రెస్ తో కుమ్మ‌క్క‌య్యేందుకు చూస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఎన్టీఆర్ వారసుల్లో బాలకృష్ణ మిన‌హా మిగ‌తా వారంద‌రికీ చంద్ర‌బాబు అన్యాయం చేస్తున్నార‌ని ల‌క్ష్మీ పార్వ‌తి నిప్పులు చెరిగారు. బాల‌య్య బాబుకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి - హరికృష్ణ వంటివారిని ప‌క్క‌న బెట్టి ఆయ‌న‌ స్థాయిని కూడా దిగజార్చారని దుయ్య‌బ‌ట్టారు. ఢిల్లీకి గులాంగా మారిన చంద్ర‌బాబు కాంగ్రెస్ కు టీడీపీని అమ్మాల‌ని చూస్తున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ కు టీడీపీని తాకట్టు పెట్టేందుకు కూడా చంద్ర‌బాబు వెనుకాడ‌ర‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు ఒక పెద్ద ఆక్టోపస్ అని - రాబందు అని ఎద్దేవా చేశారు. తాను సీఎం అయ్యేందుకే సొంత మామ‌ను వెన్నుపోటు పొడిచి గద్దె దించారని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ప్రధాని కాకుండా నాటి కాంగ్రెస్ ప్రధానితో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు. 

ఇక లక్ష్మీపార్వతి చంద్రబాబు కుమారుడు - మంత్రి లోకేష్ ను వదలకుండా విమర్శలు గుప్పించారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని తన కొడుకుని మంత్రిని చేసి.. కాబోయే సీఎం అని చంద్రబాబు అనడం సిగ్గుచేటని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేయాలని హరికృష్ణ ప్రత్యేకంగా అడగాలా.? ఆయన వారసుడిగా సీఎంగానో, ఇతర ముఖ్య స్థానంలో ఉండాల్సిన హరికృష్ణను ఇలాంటిస్థాయికి దిగజార్చారని మండిపడ్డారు.

‘చంద్రబాబు ఇన్నాళ్లు ఎన్టీఆర్ ను గద్దెదించాడని అంతా భావించారని.. కానీ ఎన్నికలకు ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రధానితో చేతులు కలిపి ఎన్టీఆర్ ను ఓడించి ప్రధాని కాకుండా అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్లు తెలిసిందని ’ లక్ష్మీ పార్వతి బాంబు  సంచలన వ్యాక్యలు చేశారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతోన్న‌ ఎన్టీఆర్ జయంతి వేడుకలకు బ‌ట్టి అన్న‌గారిపై చంద్ర‌బాబుకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంద‌న్నారు. గ‌తంలో వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించేవార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఘాట్ పరిసరాలు - రోడ్డు అలంకరణలు లేకుండా బోసిగా ఉన్నాయ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను టీడీపీకి దూరం చేసేందుకు చంద్ర‌బాబు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు.

కొంత‌కాలంగా చంద్ర‌బాబు నాయుడుకు - హ‌రికృష్ణ‌కు మ‌ధ్య దూరం పెరిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి మ‌హానాడులో సంద‌డి చేసే హ‌రికృష్ణ కొంత‌కాలంగా క‌నిపించ‌డం లేదు. టీటీడీ బోర్డు స‌భ్యుడిగా హ‌రికృష్ణ‌కు స్థానం ద‌క్కుతుంద‌ని పుకార్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ....అలా జ‌ర‌గ‌లేదు. దీంతో, తాజా మ‌హానాడులో కూడా హ‌రికృష్ణ కుటుంబ స‌భ్యులు క‌న‌బ‌డలేదు. ఇక 2009 ఎన్నిక‌ల ప్ర‌చారంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ను విచ్చ‌ల‌విడిగా వాడుకున్న చంద్ర‌బాబు...ఆ త‌ర్వాత ప‌వ‌న్ ను వాడుకొని వ‌దిలేశారు. దీంతో, ఎన్టీఆర్ కూడా పార్టీ కార్య‌క‌లాపాల‌కు చాలాకాలంగా దూరంగా ఉంటున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ....నారా వారి కుటుంబం నుంచి టీడీపీ ప‌గ్గాల‌ను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చేజిక్కించుకోవాల‌ని లక్ష్మీ పార్వ‌తి వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి, 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో హ‌రికృష్ణ‌ - ఎన్టీఆర్ - క‌ల్యాణ్ రామ్ ల వ్యూహాలు ఏవిధంగా ఉండ‌బోతున్నాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News