కుటుంబాల్లో చిచ్చులు రేపిన భూ సమీకరణ!

Update: 2015-07-09 17:30 GMT
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు ఓ మహానుభావుడు. అది నిజమన్న విషయం ఆర్థిక వ్యవహారాలు తెరపైకి వచ్చినప్పుడు మాత్రమే మనకు గుర్తుకు వస్తాయి. నవ్యాంధ్ర రాజధానిలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఇప్పటి వరకూ వాళ్లకు పెద్దగా డబ్బుల్లేవు. పొలం ఉన్నా దానిపై వచ్చే ఆదాయంతోనే జీవనోపాధి పొందారు. డబ్బులు నిల్వ లేవు కనక గొడవలూ రాలేదు. కానీ ఇప్పుడు ఎకరా కోట్లు పలుకుతుండడంతొ కలతలూ మొదలయ్యాయి.

రాజధాని భూ సమీకరణ పదుల సంఖ్యలో కుటుంబాల్లో కలతలు రేపింది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, తండ్రీకొడుకులు, అత్త మామలు ఇలా వివిధ సంబంధాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వాటాలు కుదరకపోవడంతో కొంతమంది కోర్టులకెక్కారు. దాంతో ఆయా కుటుంబాలు తమ భూములను భూ సమీకరణకు ఇవ్వలేకపోయాయి. ఇలా వివాదాల్లో ఉన్న భూమి ఏకంగా 3000 ఎకరాలకుపైగా ఉన్నట్లు అంచనా. ఈ వివాదాలు వారికి మాత్రమే కాదు ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగానే మారింది. ఆ మూడు వేల ఎకరాలనూ సేకరిస్తే కానీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్‌ పూర్తి కాదు. రాజధాని నిర్మాణమూ మొదలు కాదు.

ఇప్పటి వరకూ పొలం తాతలు ముత్తాతల పేరు మీద ఉన్నా దానిని మార్చుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆయా కుటుంబాలు వారసత్వంగా అనుభవిస్తుండడంతో దానిని పట్టించుకోలేదు. కొన్ని కుటుంబాల్లో అన్నో తమ్ముడో విదేశాలకు వెళ్లాడు. అక్కడ మంచి స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఉన్న పొలాన్ని తమ్ముడో అన్నో చూసుకుంటూ ఉన్నాడు. దానిపై వచ్చే ఆదాయం పెద్దగా లేకపోవడం.. అది ఆ కుటుంబం గడవడానికి మాతమ్రే సరిపోవడంతో అమెరికాలో ఉన్న సోదరుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు దాని విలువ పెరగడంతో వాళ్లంతా ఇప్పుడు తిరిగి వచ్చి తమకు కూడా వాటాలు కావాలంటున్నారు. ఈ వివాదాలను తేల్చడం ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. దాంతో ఆయా భూములను సమీకరిస్తామని, కోర్టు ఆ భూమి ఎవరికి చెందుతుందని తీర్పు ఇస్తే వారికే పరిహారం ఇస్తామని, కౌలు పరిహారం కూడా వారికే ఇస్తామని, అప్పటి వరకు దానిని కోర్టులోనే సమ చేస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ వివాదాలు పరిష్కారమయ్యేదెప్పుడో.. వారికి పరిహారాలు అందేదెప్పుడో!?

Tags:    

Similar News