సీనియర్ మోస్ట్ సీఎం ....అయినా డిల్లీ వైపు చూడరు...

Update: 2022-02-22 23:30 GMT
ఆయన ఈ రోజు దేశంలో  పవర్ లో ఉన్న ముఖ్యమంత్రులు అందరి కన్నా సీనియర్ మోస్ట్ అని చెప్పాలి. ఓటమెరగని వీరుడిగా అభివర్ణించాలి. ఇప్పటికి అయిదు దఫాలుగా ఒడిషా సీఎం గా 22 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఆ వీర విజేత పేరు నవీన్ పట్నాయక్. దేశంలో అత్యంత వెనకబడిన ఒడిషాను తన పరిపాలనతో ముందుకు తెచ్చారు. ఒడిషా రూపురేఖలు మార్చారు. ప్రచారానికి ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. బ్రహ్మచారిగా ఉన్న నవీన్ పట్నాయక్ తన పాలనలో ఒడిషాలో అవినీతి లేకుండా చూసుకున్నారు.

ఆయనకు ఎన్నో అవార్డులూ రివార్డులూ వచ్చాయి. ది బెస్ట్ అడ్మినిస్ట్రటర్ ఇన్ ఇండియా అవార్డుతో పాటు, ఐడియల్ చీఫ్ మినిస్టర్ పురస్కారం, హీరో టూ యానిమల్ అవార్డ్ వంటివెన్నో వచ్చాయి. ఒడిషాలో అక్షరాస్యతను మెరుగుపరుస్తూ పేదరికాన్ని పారదోలుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని పాలిస్తున్న నవీన్ పట్నాయక్ యాక్సిడెంటల్ గా రాజకీయాల్లోకి వచ్చారు.

యాభై ఏళ్ల దాకా ఆయన రాజకీయాల వాసనే చూడకుండా తన జీవితాన్ని గడిపారు. తండ్రి బిజూ పట్నాయక్ ఒడిషాలో  ఉద్ధండ రాజకీయ పిండం. అయినా నవీన్ ఆ వైపు చూడలేదు. ఇక తండ్రి మరణానంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నవీన్ 1997లో ఎంపీగా తొలిసారి ఎన్నిక అయ్యారు. వాజ్ పేయ్ ప్రభుత్వంలో రెండేళ్ల పాటు ఉక్కు మంత్రిత్వ శాఖను చూసారు. 2000 మార్చి 5 నుంచి ఒడిషా ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. మరి కొద్ది రోజుల్లో 22 ఏళ్ళ సుదీర్ఘమైన ముఖ్యమంత్రిత్వాన్ని పూర్తి చేసుకోబోతున్న నవీన్ రూటే సెపరేట్.

ఆయన వ్యక్తిగతంగా మంచి విద్యాధికుడు. కవి, రచయిత. ప్రకృతి ప్రేమికుడు. సామ్యవాది. ఆయన చాలా నిరాడంబరుడు. మితభాషి.  ఎన్నో అరుదైన లక్షణాలు కలిగిన నవీన్ ఏ రోజూ ఒడిషా గడప దాటలేదు. అభివృద్ధి చేయలేదని కేంద్రాన్ని గట్టిగా  నిందించలేదు.  తమ రాష్ట్రంలో  ఎన్నో పనులు చేశామని డబ్బా కొట్టుకోలేదు. చీటికీ మాటికీ ఢిల్లీకి వచ్చి ప్రధానులను కలసిన దాఖలాలు లేవు.  ఫిర్యాదులు చేసిన వైనాలూ లేవు.

ఆయన తన రాష్ట్రం మేలు కోసమే పనిచేస్తూ వస్తున్నారు. తన కంటే జూనియర్స్, కొత్తగా సీఎంలు అయిన వారు కూడా జాతీయ రాజకీయాల్లో పరుగులు తీస్తూ ప్రధాని పీఠం ఎక్కాలని ఉబలాటపడుతూంటే నవీన్ మాత్రం ఆ వైపే చూడరు. ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగానే ఉంటారు. అయినా జాతీయ స్థాయిలో ఎవరు   అధికారంలో ఉన్నా ఒడిషాకు రావాల్సినవి అన్నీ చక్కగా వస్తాయి. అదే నవీన్ మేధావితనం అనుకోవాలి.

ఆయన అందరి వాడుగా ఉంటూనే ఒడిషా ప్రజల మనిషిగా ఉంటారు. తన రాష్ట్రానికి ఏది మేలో అదే చేస్తారు. అందుకే ఆయనకు యూపీఏ అయినా ఎన్డీఏ అయినా మరో ఫ్రంట్ అయినా ఒక్కటే. నిజంగా నవీన్ లాంటి నాయకులు ఈ రోజుల్లో అరుదు అనే చెప్పాలి. ఆయన లాంటి వారిని చూసి అయినా మిగిలిన వారు నేల విడిచి సాము చేయకుండా తమకు ప్రజలు ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చితే అదే పదివేలు.

నవీన్ ని రాజకీయ యోగిగా అహివర్ణిస్తారు. ఆయన తక్కువ మాట్లాడుతారు. ఆయన మాట కంటే చేత ఎక్కువగా ఉంటుంది. ఎవరినీ గట్టిగా నిందించిన దాఖలాలు లేవు. ఈ దేశంలో ప్రధాని కుర్చీ గౌరవాన్ని తీసేస్తూ ఇష్టం వచ్చినట్లుగా విమర్శించే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇలా సీఎం కాగానే అలా పీఎం పోస్ట్ మీద కన్నేసే వారూ చాలానే ఉన్నారు. ఎక్కడా బలం లేకపోయినా జాతీయ పార్టీ అని చెప్పుకునే బడా బాబులూ ఉన్నారు.

కానీ పాతికేళ్ళుగా పటిష్టంగా ఉన్నా బిజూ జనతాదళ్ ని మాత్రం ఒడిషాకే పరిమితం చేస్తూ తాను రాష్ట్రానికే కట్టుబడి ఉన్న నవీన్ లాంటి వారు అధికార ఆరాటంతో పరుగులు పెట్టే నేతలకు అచ్చమైన గుణపాఠం కదా. నేర్చుకుంటే నవీన్ నుంచే ఎన్నో నేర్చుకోవాలి. అభివృద్ధి అంటే ఏంటో, సమాఖ్య వ్యవస్థలో ఎలా మనగలగలో, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా సజావుగా నడిపించుకోవాలో. ఏ పేచీలూ  లేకుండా అభివృద్ధి పనులు ఎలా జరిపించుకోవాలో.  ఇలా ఎన్నో పాఠాలు ఒడిషా నుంచి దేశానికి నేర్చుకుంటే ఉన్నాయి.
Tags:    

Similar News