ఇదిగో రాజేంద్రా ! బ‌డ్జెట్లో మా ఊరికి ఏమిస్తావ్ !

Update: 2022-03-03 10:30 GMT
ఏటా బ‌డ్జెట్ అన్న‌ది ఓ స‌భా సంప్ర‌దాయంగానే మిగిలిపోతుంది అన్న‌ది ఎన్న‌డూ వినిపించే విమర్శ.ఏటా ఆదాయం లెక్క‌లు చెప్పి అప్పుల లెక్క‌లు చెప్పి త‌రువాత ఊసురోమ‌నిపించ‌డం మ‌న ఎకానామిక్స్ సైంటిస్టులు అయిన ప్రియ ఆర్థిక మంత్రులకు తెలిసిన విద్య.ఆ విధంగా అర్థ‌శాస్త్రం కాస్త అర్థం లేని లేదా తెలియ‌ని శాస్త్రంగానే మిగిలిపోతోంది.రూపాయి రాక పోక  అన్న‌వి సామాన్యుడికి ప‌ట్ట‌కుండానే పోతున్నాయి.ఇవే లెక్క‌లు కాస్త వివ‌రంగా చెప్ప‌వ‌చ్చు క‌దా అని ఎన్నో సార్లు మీడియా గ‌గ్గోలు పెట్టినా వినిపించుకునే నాథుడే ఉండరు.ఈ సారి లెక్క‌లు ఎలా ఉండ‌నున్నాయో కానీ శ్రీ‌కాకుళం జిల్లాకు బుగ్గ‌న ఏమిస్తారు అన్న‌దే ఈ క‌థ‌న ప్రాధాన్యాంశం.

రెండు ద‌శ‌లు దాటి మూడో ద‌శ‌కు వ‌చ్చాక శ్రీ‌కాకుళంలో క‌రోనా సంబంధిత ప్ర‌భావాలు మ‌రీ అంత అత‌లాకుత‌లం చేయ‌లేదు. కానీ వైద్య రంగం ఆవ‌శ్య‌క‌త‌ను మొద‌టి రెండు ద‌శ‌లూ సుస్ప‌ష్టంగానే చాటాయి.అందుకే ఈ సారి వైద్య రంగంపై కేటాయింపులు ముఖ్యంగా జిల్లా కేంద్రాస్ప‌త్రి (రిమ్స్‌) కి కేటాయించే నిధులు, ఎప్ప‌టి నుంచో అంద‌కుండా పోయిన క‌రోనా ప‌రిహారాలు,ఇంకా చెప్పాలంటే ఆస్ప‌త్రుల్లో కొనుగోలు చేయాల్సిన మందుల‌కు ఇత‌ర ఆధునిక ప‌రికరాల‌కు చెల్లించాల్సిన నిధులు ఇవ‌న్నీ కూడా ఇప్పుడిక అవ‌స‌ర‌మే! ఎందుకంటే కనీసం గాజు గుడ్డ కొనుగోలు చేసేందుకు కూడా నిధులు లేని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు సీతంపేట లాంటి మ‌న్యం ప్రాంతాల్లో ఉన్నాయి.

జిల్లాల ఏర్పాటు విభ‌జ‌న అంటూ సంద‌డి చేస్తున్న జ‌గ‌న్ కు ఈ సారి చేసే విన్నపం ఏంటంటే ఆధునిక వ‌స‌తులున్న విధంగా మ‌న్యం ఆస్ప‌త్రుల‌ను అభివృద్ధి చేసేందుకు నిధులు ఇవ్వ‌మ‌ని! మ‌న్యం జిల్లా పేరిట సంద‌డి చేసే క‌న్నా ముందుగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆస్ప‌త్రులు వీటి నిర్వ‌హ‌ణ‌పై దృష్టి సారించాల‌ని ఏజెన్సీ వాసులు వేడుకుంటున్నారు.

ఉద్దానంలో (ప‌లాస కేంద్రంగా నిర్మించ త‌ల‌పెట్టిన ఆధునిక వైద్య‌శాల‌) త‌ల‌పెట్టిన ఆస్ప‌త్రి నిర్మాణానికి నిధులు ఇవ్వాల‌ని కూడా వేడుకుంటున్నారు ఈ జిల్లా వాసులు.ముందుగా ఈ ఆస్ప‌త్రి నిర్మాణంపై మాట ఇచ్చింది ఆ రోజు జ‌గ‌న్. కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌ను ఆదుకుంటాన‌ని చెప్పి ఆస్ప‌త్రి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసి వెళ్లింది కూడా జ‌గ‌న్.క‌నుక ఆయ‌నదే బాధ్య‌త అని విప‌క్షాలు ప‌దే ప‌దే అంటున్నాయి.

వైద్యం ఆరోగ్యం త‌రువాత సాగునీటి రంగం సంబంధించిన నిధుల కోసం వేచి చూస్తోంది.తోట‌ప‌ల్లి కాలువ ప‌నుల‌కు మొన్న‌నే విజ‌య‌న‌గ‌రంలో శంకుస్థాప‌న చేశారు.త్వ‌రిత గ‌తిన ప‌నులు చేయ‌డంతో పాటు ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు బుగ్గ‌న నిధులిస్తే మేలు.

ఇదే కాకుండా వంశ‌ధార నిర్వాసితుల స‌మ‌స్య‌లు పరిష్క‌రించ‌డంలో కూడా ఈ ఆర్థిక బడ్జెట్లో కేటాయింపులు ఇచ్చి వారిని ఆదుకోవాల‌ని కూడా ఓ విన్న‌పం. ఈ రెండూ అయ్యాక విద్యా రంగం కేటాయింపులు. ఇవి ఎంతో ముఖ్యం కానీ నాడు నేడు రెండో ఫేజ్ మాత్రం అస్స‌లు బాలేదు. నిధులు ఇస్తేనే ప‌నులు అన్న‌ది ఇప్ప‌టి నినాదం. వీటితో పాటు ర‌హ‌దారుల మ‌రమ్మ‌తులపై ఇంకా చెప్పాలంటే ర‌క్షిత మంచి నీటి ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ పై దృష్టి నిలిపి నిధులు ఇవ్వాలి. ఇవి చేయ‌డం చాలు ఇంకేమీ వ‌ద్దు.

రోడ్డు,నీరు,విద్య, ఆరోగ్యం ఈ నాలుగింటినీ బాగు చేయండి మిగిలిన విష‌యాలు త‌రువాత అని ఇక్క‌డి ప్రాంత ప్ర‌జ‌లు క‌ర్నూలు పెద్దాయ‌న అయిన బుగ్గ‌న‌ రాజేంద్ర ను వేడుకుంటున్నారు.
Tags:    

Similar News