అప్పట్లో షేరు రూ.2.70.. ఇప్పుడేమో ఏకంగా రూ.1440

Update: 2022-03-30 04:31 GMT
అర్థమైనట్లే అనిపిస్తూనే.. ఎంతకూ అర్థం కానట్లుగా అనిపించే సబ్జెక్టు ఏమైనా ఉందంటే అది స్టాక్ మార్కెట్ గా చెప్పాలి. ఎప్పుడేం జరుగుతుందో తోపుల్లాంటి వారు సైతం అంచనా వేయలేని రీతిలో రియాక్టు అవుతుంటుంది. నిపుణుల్ని సైతం బొక్క బోర్లా పడేసే మేజిక్ స్టాక్ మార్కెట్ సొంతం. అయితే.. స్టాక్ మార్కెట్ మీద పట్టు సాధిస్తే.. కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పాలి. కాకుంటే.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వేళలో.. ఎంత సూక్ష్మమైన అంశాల్ని ఫోకస్ చేస్తే.. అంత లాభాలు రావటమే కాదు.. అపాయాల నుంచి కూడా తప్పించుకునే వీలుందని చెప్పాలి.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. హైదరాబాద్ కుచెందిన ఒక కంపెనీ అమోఘంగా రాణిస్తోంది. ఒకప్పుడు సదరు కంపెనీ షేరు ఒక్కొక్కటి రూ.2.70 మాత్రమే పలికిన సదరు షేరు.. ఈ రోజున ఒక్కొక్కటి రూ.1440కు చేరుకుంది. ఇంతకీ ఇంతటి అమోఘమైన ఫలితాల్ని సాధించిన కంపెనీ.. ‘‘తాన్లా ఫ్లాట్ ఫాం లిమిటెడ్’’. హైదరాబాద్ కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ తాన్లా ప్లాట్ ఫామ్స్ గడిచిన ఎనిమిదేళ్లలో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారందరికి కాసుల వర్షం కురిపించింది.

అయితే.. ఈ ఘనత రాత్రికి రాత్రి కంపెనీ సొంతం కాలేదు. అందుకోసం చాలానే విషమ పరీక్షల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అవమానాలు.. అవహేళనల్ని ఎదుర్కొని కష్టపడటం వల్లే.. ఈ రోజున ఈ స్థాయిలోకి చేరామని చెప్పక తప్పదు. 2007 జనవరి 5న తాన్లా ప్లాట్ ఫాం నేషనల్ స్టాక్ ఎక్సైంజ్ లో షేరును లిస్టు చేశారు. ఆ రోజున ఒక్కో షేరు రూ.189.93 వద్ద లిస్ట్ అయ్యింది. అయితే.. కంపెనీ ఆరంభంలో భారీ నష్టాల్ని చవిచూసింది. ఒకదశలో ఈ షేరు విలువ రూ.2.70కు పడిపోయింది.

అయితే.. మారిన కాలంతో పాటు.. అవసరాలు మారటం.. అందుబాటులోకి వచ్చిన క్లౌడ్ టెక్నాలజీ ఈ కంపెనీ సుడిని మార్చేసేలా చేసింది. 2014 మార్చి 28న ఈ కంపెనీ షేర్ ఒక్కొక్క దాని విలువ రూ.4.31 గా ఉంటే.. గడిచిన ఎనిమిదేళ్లలో ఈ కంపెనీ షేర్ విలువ ఏకంగా 30,556 శాతం పెరగటం గమనార్హం.

ఈ కంపెనీలో అప్పట్లో రూ.లక్ష ఎవరైనా పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈ రోజున ఏకంగా రూ3 కోట్ల లాభాలు వచ్చేవన్న ఊరింపు వ్యక్తమవుతోంది.  ఏమైనా.. ఈ మొత్తం ఎపిసోడ్ విన్నంతనే అనిపించేది ఒక్కటే.. ధైర్యే సాహసే లక్ష్మీ అని. భారీ నష్టాలతో దారుణంగా పడిపోయిన షేరు మీద రూ.లక్ష ఎవరైనా పెట్టే సాహసం చేస్తారా? అందుకే.. అలాంటి సాహసం చేసిన వారిని లక్ష్మీ వెతుక్కుంటూ వచ్చిందని చెప్పాలి.
Tags:    

Similar News