కలుపుకు పోతున్న తెలంగాణ.. దూరం చేసుకుంటున్న ఆంధ్రా

Update: 2022-02-25 04:28 GMT
మంచి వంటకంలో అన్ని ఉన్నట్లే.. రాజకీయం అన్నాక  ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ధోరణి ఉంటుంది. మడి కట్టుకొని రాజకీయం చేసే రోజులు పోయాయి. సంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తూ.. ప్రత్యర్థులపై పగ తీర్చుకోవాలన్నా.. దానికి కొన్ని గీతలు గీసుకొని వ్యవహరించే పాలకులు పోయారు. ఇప్పుడంతా రివెంజ్ తీర్చుకోవటానికి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టని తీరు రాజకీయ అధినేతల తీరులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుస్తారు.

వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వతహాగా వ్యాపారస్తుడు. అసలు సిసలు బిజినెస్ మేన్ కు రాజకీయ నాయకుడి మాదిరి శాశ్వత స్నేహితులు.. శాశ్వత శత్రువులు అన్న వారు అస్సలు ఉండరు. అందుకే.. ఆచితూచి అన్నట్లుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కనిపిస్తుంది. వ్యాపారం చేసే వారిలో ఎవరిలోనైనా సరే.. తమ వ్యక్తిగత కారణాలు.. భావోద్వేగాలతో వ్యాపారానికి నష్టం వాటిల్లేలా చేసుకోవటానికి సుతారం ఇష్టపడరు. మరి.. తన కెరీర్ ను షురూ చేసిందే బిజినెస్ మ్యాన్ గా అయిన జగన్.. తన ప్రత్యర్థుల విషయంలో ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తారంటే.. దానికి కారణం ఆయనలోని కఠినమైన రాజకీయ నేతే.

ఒకసారి ప్రత్యర్థిగా ఫిక్స్ అయ్యాక.. వెనక్కి తగ్గేదెలే.. అన్నట్లుగా సీఎం జగన్ తీరు ఉంటుంది. ఈ కారణంతోనే.. ఏపీలోని సినిమా థియేటర్ల లో టికెట్ల ధరలపై నెలకొన్న పంచాయితీనే నిదర్శనం. ఇప్పటికే పలుమార్లు సినీ రంగ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవటం.. టికెట్ల పంచాయితీని ఒక కొలిక్కి తీసుకురావాలంటే ఏం చేయాలో అవన్నీ చేసిన తర్వాత కూడా ఆయన మనసు ఊరుకున్నది లేదు. తన రాజకీయ ప్రత్యర్థుల్లో ఒకరైన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసే విషయంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న వైఖరి ఎంత చెప్పినా తక్కువే.

అదే పనిగా వెంటాడుతున్న తీరు ఇప్పుడు ఆయన ఇమేజ్ ను దెబ్బ తీసే వరకు వెళ్లిన పరిస్థితి. తాజాగా జరిగిన భీమ్లానాయక్ చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ సందర్భంగా ఈ వ్యవహారం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. దీనికి కారణం.. చిత్ర పరిశ్రమ మరింత డెవలప్ అయ్యే విషయంలో అటు తెలంగాణ.. ఇటు ఏపీ ఏ తీరులో వ్యవహరిస్తుందన్నది అర్థమయ్యేలా సాగింది. ఒకవైపు మనసులో పంతాన్ని పెట్టుకొని టికెట్ల ధరల్ని దారుణంగా తగ్గించేసి.. ఇదే తమ పాలసీ అని.. అదేమంటే పేదలకు తక్కువ ధరలకు వినోదం అందుబాటులో ఉండేలా చేయటం కూడా తప్పేనా? అంటూ వాదన వినిపిస్తున్న జగన్ ప్రభుత్వం.. తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు.. ఆర్జిత సేవల ధరల్ని భారీగా పెంచేసిన వైనం చూసినప్పుడు తక్కువ ధరలకు వినోదం అందించటం వెనుకున్న అసలు కారణం ఇట్టే అర్థమవుతుంది.
 
జగన్ సర్కారు అనుసరిస్తున్న వైఖరితో ఏపీలో చిత్ర పరిశ్రమ ఎదిగే అవకాశం తక్కువన్న విషయం అర్థం కాక మానదు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. మంత్రి కేటీఆర్ చెప్పినట్లుగా హైదరాబాద్ మహానగరం దేశానికే చిత్ర పరిశ్రమ రాజధానిగా అవతరించే అవకాశం ఉందని చెప్పాలి. చెన్నై నుంచి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమ వచ్చిన రోజుల నుంచి.. ఈ రోజు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత సింఫుల్ గా చిత్ర అనుమతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.

ఇటీవల కాలంలో తెలుగు చిత్రాలే కాదు.. ఇతర  భాషా చిత్రాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. అందులో ప్రభుత్వ తీరు కూడా ఒకటన్న విషయాన్ని మర్చిపోలేం. ఇదంతా చూసినప్పుడు.. తన వైఖరితో తెలంగాణ రాష్ట్రం చిత్ర పరిశ్రమ మరింత ముందుకెళ్లేలా చేస్తుంటే.. తన మొండితనంతో ఏపీ సినీ పరిశ్రమకు అంతకంతకూ దూరమవుతోందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News