ఆ నేత‌లు ఎక్క‌డ‌? బాబు.. జ‌ల్లెడ‌!

Update: 2022-03-20 09:30 GMT
ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధ‌మైన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆ దిశ‌గా ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. 2024 ఎన్నిక‌ల్లో గెలిస్తేనే కానీ త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌ని.. పార్టీకి మ‌నుగడ ఉంటుంద‌నే విష‌యం బాబుకు తెలియందేమీ కాదు. అందుకే ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. బాబు బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు కానీ మిగ‌తా నేత‌ల సంగ‌తి ఏమిటీ? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

అస‌లు పార్టీలో ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్న నాయ‌కుల‌ను వేళ్ల మీద లెక్క‌పెట్టొచ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి మిగ‌తా నేత‌లు ఏం చేస్తున్నారు? వాళ్ల విష‌యంలో బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నారు? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

జాడ లేని ఎంపీ అభ్య‌ర్థులు..
2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన ఎంపీ అభ్య‌ర్థుల్లో చాలా మంది జాడ క‌నిపించ‌డం లేదు. ముగ్గురు లేదా న‌లుగురు మిన‌హా మిగ‌తా ఎవ్వ‌రూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గా పాల్గొన‌డం లేదు. గ‌త  ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ముగ్గురు మాత్ర‌మే ఎంపీలుగా గెలిచారు. ఓట‌మి పాలైన 22 మంది ఎంపీ అభ్య‌ర్థుల్లో న‌లుగైదుగురు మిన‌హా మిగ‌తా ఎవ‌రూ చంద్ర‌బాబుకు అందుబాటులో లేర‌ని స‌మాచారం. కొంత‌మంది పార్టీని వీడితే.. మ‌రికొంత మంది రాజ‌కీయాల‌కు దూర‌మైపోయారు.

ఒంగోలు నుంచి పోటీ చేసిన శిద్దా రాఘ‌వ‌రావు, క‌డ‌ప నేత ఆది నారాయ‌ణ‌రెడ్డి, నెల్లూరు నుంచి పోటీ చేసిన బీద మ‌స్తాన్ రావు, కాకినాడ నుంచి బ‌రిలో నిలిచిన చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌తో పాటు ఆడారి ఆనంద్‌, శ్రీరాం మాల్యాద్రిలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. మాగంటి రూప, మాగంటి బాబు, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, కిషోర్ చంద్ర‌దేవ్‌, శివ‌రామ‌రాజులు లాంటి నేత‌లు వివిధ కార‌ణాల‌తో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. రాజంపేట నుంచి పోటీ చేసిన స‌త్య‌ప్ర‌భ‌, చిత్తూరు నుంచి బ‌రిలో నిలిచిన శివ‌ప్ర‌సాద్‌లు మృతి చెందారు.

ఆ స్థానాల‌పై దృష్టి..
గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాలైన ఎంపీ అభ్య‌ర్థుల్లో కొన‌క‌ళ్ల నారాయణ‌, అశోక్ గ‌జ‌ప‌తిరాజు, శ్రీ భ‌ర‌త్ కిష్ట‌ప్ప‌, జేసీ ప‌వ‌న్ రెడ్డిలు మాత్ర‌మే ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త నేత‌ల‌ను ఎంపిక చేయాల‌ని బాబు భావిస్తున్నార‌ని తెలిసింది. ఆర్థిక‌, సామాజిక అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని అభ్య‌ర్థుల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఎంపీ అభ్య‌ర్థుల‌ను కూడా ముందుగానే ఖ‌రారు చేయాల‌న్న ఉద్దేశంలో బాబు ఉన్న‌ట్లు టాక్‌. ఇటీవ‌ల సీనియ‌ర్ నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో బాబు ఈ విష‌యాన్ని ప్ర‌ధానం ప్ర‌స్తావించార‌ని తెలిసింది. దాదాపు ప‌ది నుంచి ప‌న్నెండు స్థానాల్లో కొత్త అభ్య‌ర్థుల‌ను బాబు ఎంపిక చేస్తార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.
Tags:    

Similar News