కరోనా అదుపులోకి.. కాలర్ ట్యూన్ కాలగర్భంలోకి

Update: 2022-03-28 10:30 GMT
సరిగ్గా రెండేళ్ల క్రితం..
కొవిడ్ అంటే ఏమిటో తెలియదు.. దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలియదు.. చికిత్స ఏమిటో కూడా తెలియదు.. దీంతో దేశం మొత్తం లాక్ డౌన్.. అలాంటప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం  కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ ను సాధనంగా వాడుకుంది. " కరోనా వైర్‌సతో ఇప్పుడు యావత్‌ దేశం పోరాడుతోంది. మనమంతా ఆ వ్యాధితో పోరాడాలి. రోగితో కాదు..." అంటూ కాలర్ ట్యూన్ ను సెట్ చేశారు.

అయితే జూన్ నుంచి అన్ లాక్ ప్రక్రియ ప్రారంభంతో "నమస్కారం.. కొవిడ్‌-19 అన్‌లాక్‌ ప్రక్రియ ఇప్పుడు దేశమంతటా మొదలైంది. ఇలాంటి సమయంలో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లకండి" అంటూ మరో కాలర్‌ట్యూన్‌ ఫోన్లలో మోగింది!! "జబ్‌ తక్‌ దవాయీ నహీ.. తబ్‌ తక్‌ కోయీ ఢిలాయీ నహీ" అంటూ బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ కంచు కంఠంతో వినిపించిన కాలర్‌ ట్యూన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!! అలాగే.. కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చాక.. అర్హులందరూ వ్యాక్సిన్ పొందాలంటూ.. అనంతరం టీకా పంపిణీ ఎక్కడివరకు వచ్చిందో వివరిస్తూ కాలర్ ట్యూన్ ప్రస్థానం సాగింది. అయితే, ఇప్పుడిదంతా గతం కానుంది.

అన్ని కొవిడ్ రూల్స్ ఖతం.. ఆఖరికి కాలర్ ట్యూన్ కూడా
దేశంలో కొవిడ్ కేసులు 1,500 దిగువన నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసులు 20వేలకు తగ్గాయి. మరో కొత్త వేరియంట్ వచ్చి.. అది కూడా అత్యంత ప్రమాదకరం అయితేనే నాలుగో వేవ్ కు అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే 190 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. 12 ఏళ్ల పిల్లలకూ టీకా అందుబాటులోకి వచ్చింది. అంతకంటే చిన్న వయసు వారికీ వ్యాక్సిన్ పంపిణీ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇక కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో కొవిడ్‌ కాలర్‌ ట్యూన్లకు స్వస్తి పలకాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

ఈమేరకు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 21 నెలలుగా మనమంతా ఫోన్లలో వింటున్న కొవిడ్‌ కాలర్‌ ట్యూన్లకు కాలం చెల్లినట్లయింది.  మరోవైపు"ఆ కాలర్‌ ట్యూన్ల లక్ష్యం నెరవేరింది.. ఇకనైనా తొలగించండి" అంటూ సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏ), మొబైల్‌ వినియోగదారుల నుంచి కేంద్ర టెలికాం విభాగానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. "ఎవరికైనా ఎమర్జెన్సీ కాల్స్‌ చేసుకునే క్రమంలో.. కొవిడ్‌ కాలర్‌ట్యూన్‌ వల్ల కాల్‌ కనెక్ట్‌ కావడానికి ఎక్కువ సమయం పడుతోంది.

అంతేకాదు విలువైన సెల్యులార్‌ బ్యాండ్‌ విడ్త్‌ వినియోగం అవసరానికి మించి జరుగుతోంది. ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తి కాల్స్‌ కనెక్టివిటీకి పట్టే సగటు సమయం పెరుగుతోంది" అని పేర్కొంటూ టెలికాం విభాగానికి సీవోఏ ఓ లేఖ రాసింది. ఎంతోమంది మొబైల్‌ వినియోగదారులు కూడా ఈ అంశాన్ని పలుమార్లు లేవనెత్తారు. వీటని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ 'కొవిడ్‌ కాలర్‌ ట్యూన్‌'ను తొలగించాలని నిర్దేశించింది.

అంతర్జాతీయ విమానాలు షురూ సరిగ్గా రెండేళ్ల అనంతరం ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 37 దేశాలతోనే బయో బబుల్ ఒప్పందం మేరకు సర్వీసులు నడుస్తుండగా ఇకపై అన్ని దేశాలకు విమానాలు తిరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ప్రయాణికుల రద్దీ పెరగనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. దీనికితోడు వేసవి సెలవుల సీజన్ కావడంతో రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇకపై విమానాశ్రయాలు కళకళలాడటం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరోవైపు కొవిడ్ ఆంక్షలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది.

భారత్ లో వేసవి మధురానుభూతిని దెబ్బకొట్టి..
ఇండియాలో వేసవి అంటే.. మల్లె పూలు, మామిడి కాయలు, వివాహాది సందళ్లు.. పసందైన విందులు.. పిల్లలకు సెలవులు.. విహార యాత్రలు.. అబ్బో ఒకటే సందడి.. కానీ, అదేంటో కానీ పాడు కరోనా రెండేళ్ల నుంచి ఈ ఆనందాన్ని దూరం చేసింది. 2020 మార్చిలో.. అంటే సరిగ్గా వేసవి ప్రారంభంలో దేశంలో కొవిడ్ పాదం మోపింది. ఆ సీజన్ అంతా లాక్ డౌన్ తో పోయింది.

అంతా బంద్ కావడంతో అసలు వేసవి ఆనందమే లేదు. పోతే పోయింది.. పీడ విరిగింది అనుకుంటే.. సరిగ్గా 2021 మార్చికి డేంజరస్ డెల్టా వేరియంట్ విరుచుకుపడింది. లక్షల ప్రాణాలను నిలువునా తోడేసింది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత పాశవికంగా సాగింది. అప్పటికి టీకా కూడా పెద్దగా అందుబాటులోకి రాకపోవడం ప్రాణ నష్టాన్ని పెంచింది.

ఇక 2021 జూలై నాటికి సెకండ్ వేవ్ ముగిసింది. కానీ, ఈ ఏడాది జనవరిలో థర్డ్ వేవ్ మొదలవడంతో కలకలం పుట్టింది. అయితే, టీకా పంపిణీ ముమ్మరం కావడం, ఒమైక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకారి కాకపోవడంతో థర్డ్ వేవ్ ఎలా వచ్చిందో అలా పోయింది. ఈ నేపథ్యంలో కొవిడ్ నుంచి భారత దేశం ఊపిరి పీల్చుకున్నట్లే కనిపిస్తోంది. కాబట్టి.. మనం చెప్పుకొన్న పసందైన వేసవి మళ్లీ రానుంది.
Tags:    

Similar News