పవన్ని పెంచాలా...హాట్ డిస్కషన్...?

Update: 2022-03-18 11:34 GMT
ఏపీలో రెండే పార్టీలు ఉంటే రాజకీయం కూడా సులువుగా ఉంటుంది. అటు కాకపోతే ఇటుగా జనాలు వస్తారు. అధికారం హ్యాపీగా చేతుల్లోకి వస్తుంది. ఎవరైనా ఇదే కోరుకుంటారు. ఎక్కడైనా పోటీ ఉండాలి కానీ రాజకీయాల్లో ఉండరాదు అన్నదే అసలైన వ్యూహం. మరి ఢక్కామెక్కీలు తిన్న పార్టీ, ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఉన్న టీడీపీ కూడా ఇలాగే అనుకుంటే తప్పేముంది.

ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ టీడీపీల మధ్యనే దశాబ్దాల పాటు పోటీ ఉండేది. అధికార పక్షం వెగటు పుడితే ఎంచక్కా పవర్ బొంగరంలా గిర్రున తిరుగుకుంటూ విపక్షం చేతిలో పడేది. అయితే టీయారెస్ ఎంట్రీతో గందరగోళం ఏర్పడింది. ట్రయాంగిల్ లో ఎక్కువగా నష్టపోయింది టీడీపీ మాత్రమే. విభజన తరువాత పూర్తిగా ఏపీకే పరిమితం అయిపోయింది.

ఏపీలో చూసుకుంటే కాంగ్రెస్ అంతర్ధానం అయినా వైసీపీ రూపంలో బలమైన పార్టీ టీడీపీకి ఢీ కొట్టింది. 2014 ఎన్నికల్లో మోడీ వేవ్, పవన్ సపోర్ట్ తో టీడీపీ గెలుపు బాట పట్టింది. ఇక 2019లో మాత్రం టీడీపీ పరాజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినా సరే తేరుకుని 2024 వైపుగా దూసుకువెళ్తోంది.

అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులను గమనంలోకి తీసుకుంటూ పొత్తులకు సిద్ధమని టీడీపీ చెబుతున్నా ఇపుడు జనసేన వంటి పార్టీల దూకుడు చూస్తూంటే అసలుకే ఎసరు వస్తుందా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయిట. పవన్ సినీ గ్లామర్ తో పాటు బలమైన సామాజికవర్గం కూడా తోడు అయింది. దాంతో ఏపీలో స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీగా జనసేన ఆవిర్భవించే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి.

ఇలాంటి టైం లో ఏపీలో కూడా ట్రయాంగిల్ ఫైట్ జరిగితే ఇపుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా  టీడీపీకే భారీ నష్టం అని ఆ పార్టీలో సీనియర్లు అంచనా వేస్తున్నారు. అటు వైపు వైసీపీ బలంగా ఉంది. జగన్ రాజకీయంగా యువకుడి కింద లెక్క.  మరో వైపు పవన్ కూడా యువతకు ప్రతినిధిగా మరింతకాలం రాజకీయం చేసే స్థితిలో ఉన్నారు.

ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు వయసు పైబడి ఉన్నారు. ఆయనకు రాజకీయాల మీద మోజు కూడా పెద్దగా లేదు. ఆయన పడే శ్రమ అంతా కూడా కొడుకు లోకేష్ కోసమే. రేపటి రోజున జగన్ వర్సెస్ పవన్ వర్సెస్ లోకేష్ గా ఏపీ పాలిటిక్స్ టర్న్ అయితే టీడీపీకే  మార్కులు తగ్గుతాయన్న బెంగ అయితే పసుపు శిబిరంలో ఉందిట.

అందుకే జనసేన పొత్తుల మీద బాహాటంగా పిలుపు ఇచ్చినా కూడా ఎస్ అనే పరిస్థితుల‌లో  టీడీపీ ఇప్పటికైతే లేదు అంటున్నారు. అన్ని అంశాలనూ బేరీజు వేసుకునే దీని మీద అడుగులు వేసే అవకాశం ఉంది అంటున్నారు. జనసేనతో పవర్ షేర్ అంటే మాత్రం టీడీపీకి అది రాజకీయ మరణ శాసనం గానే ఆ పార్టీలో చర్చ సాగుతోంది.

పొత్తుల పేరిట కొన్ని సీట్లు ఇచ్చి అసలైన అధికారం తమ చేతులలో ఉంచుకోవాలన్నదే టీడీపీ ప్లాన్. మరి ఆ విధంగా జరుగుతుందా అంటే జనసేన దూకుడు చూస్తే కాదనే చెప్పాలి. ఈసారి పొత్తులు కాదు, అధికారంలో వాటా అంటోంది జనసేన. సో ఏపీలో ఇపుడు టీడీపీ రాజకీయం కొంత సంక్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉంది అంటున్నారు. కోరి పవర్ లో షేర్ ఇచ్చి పవన్ని పెంచితే అది చివరాఖరుకు తమకే చేటు తెస్తుందా అన్న కలవరం అయితే సైకిల్ పార్టీలో ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏ రకమైన పరిణామాలు ఏపీలో చోటు చేసుకోబోతాయో.
Tags:    

Similar News