మోత్కుప‌ల్లికి మిగిలేదేమిటీ?

Update: 2022-03-31 02:30 GMT
తెలంగాణ రాజ‌కీయాల్ల ఆయ‌నో సీనియ‌ర్ నేత‌.. ద‌ళిత నాయ‌కుడిగా పెద్ద పేరుంది. కానీ ఇప్పుడు ఆయ‌న భవిష్య‌త్ మాత్రం ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఆ నాయ‌కుడే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. రాజ‌కీయాల్లో ఎంతో అనుభ‌వం ఉన్న ఆయ‌న‌కు పార్టీలు మారిన ప‌ద‌వులు మాత్రం ద‌క్క‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

2014లో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ అధికారంలోకి రావ‌డంతో మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి వ‌స్తుంద‌నే ప్ర‌చారం సాగింది. కానీ అది సాధ్య‌ప‌డ‌లేదు. దీంతో ఆయ‌న బీజేపీలో చేరిపోయారు. కొన్నాళ్లు ఉన్న త‌ర్వాత అక్క‌డ పొస‌గ‌క అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఆక‌ర్షితుడైన మోత్కుప‌ల్లి కారెక్కారు. ద‌ళిత నేత‌గా త‌న‌కు కేసీఆర్ త‌గిన ప్రాధాన్య‌త‌నిస్తార‌ని ఆశించారు. కేసీఆర్ కూడా అదే విధంగా సాగారు. ద‌ళిత బంధు ప‌థ‌కం కోసం ప్ర‌త్యేకంగా క‌మిష‌న్ ఏర్పాటు చేసి దాని ఛైర్మ‌న్‌గా మోత్కుప‌ల్లిని కూర్చొబెడ‌తార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

కేసీఆర్ కూడా మోత్కుప‌ల్లికి క‌చ్చితంగా పెద్ద ప‌ద‌వి ఇస్తాన‌ని అన్నారు. కానీ అది ఇంకా ఆచ‌ర‌ణ‌లోకి రాలేదు. మ‌రోవైపు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశించి మోత్కుపల్లి భంగ‌ప‌డ్డారు. ఇక ఇప్పుడు ఆయ‌న రాజ్య స‌భ సీటుపై ఆశ‌లు పెట్టుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌లో మూడు రాజ్య‌స‌భ ప‌ద‌వులు ఖాళీ అవుతాయి. డీఎస్ శ్రీనివాస్‌, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ప‌ద‌వీ కాలం జూన్‌లో ముగుస్తుంది. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ ఎన్నికైన బండా ప్ర‌కాశ్ త‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీకి రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ మూడు స్థానాల్లో కేసీఆర్ ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే ఆస‌క్తి క‌లుగుతోంది.

త‌న‌కు ఓ అవ‌కాశం ద‌క్కుతుంద‌ని మోత్కుప‌ల్లి భావిస్తున్నార‌ని తెలిసింది. రాష్ట్రంలో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ద‌ళిత సామాజిక వర్గాన్ని తిప్పుకునేందుకు ఆ స‌మీక‌ర‌ణం ప్ర‌కారం కేసీఆర్ త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతార‌ని మోత్కుప‌ల్లి అనుకుంటున్నారు. ద‌ళితుల కోటా కింద అవ‌కాశం వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. కానీ కేసీఆర్ లెక్కలు వేరుగా ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి మోత్కుప‌ల్లి విష‌యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.
Tags:    

Similar News