కల వస్తే.. చోరీ చేసేస్తాడు.. అస్సలు వెనక్కి తగ్గడు

Update: 2022-04-02 04:11 GMT
దొంగలు చాలామందే ఉంటారు. కొందరు చెప్పే మాటలు.. దొంగతనాలకు వారు వ్యవహరించే తీరు చాలా సిత్రంగా.. రోటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చదవబోయే దొంగ కూడా ఈ కోవకు చెందిన వాడే. మిగిలిన దొంగలకు భిన్నంగా.. తనకు కల వస్తే.. కలలో వచ్చిన ప్రాంతంలో కన్నం వేయటం ఈ దొంగకు అలవాటు. తాజాగా అతడ్ని పోలీసులు వనస్థలిపురంలో అరెస్టు చేశారు.

ఇప్పటికి 43 కేసులు అతగాడి మీద ఉన్నప్పటికి.. దొంగతనం చేసే విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గని తీరు అతగాడి సొంతం. గుంటూరు జిల్లాకు చెందిన ఈ వెరైటీ దొంగ పేరు ముచ్చు అంబేడ్కర్. యాభై ఏళ్ల ఇతన్ని కందుల రాజేంద్రప్రసాద్ గా.. అలియాస్ రాజుగా కూడా పిలుస్తుంటారు. 1989 నుంచి దొంగతనాలు చేసే అలవాటు ఉన్న అతడికి.. ముందు రోజు తాను దొంగతనం చేయాల్సిన ప్రాంతానికి సంబంధించిన కల వస్తుంది.

ఒకసారి కలలో ప్రాంతం డిసైడ్ అయితే.. ఆ తర్వాతి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలోకన్నం వేయాల్సిందే. దాదాపు 33 ఏళ్ల నుంచి దొంగతనాలు చేస్తున్న ఇతను ఎలక్ట్రీషియన్ గా కూడా పని చేస్తుంటాడు. ఒక్క హైదరాబాద్ లోనే ఇతగాడి మీద ఏకంగా 21 కేసులు ఉన్నాయంటే.. చోరీలు చేయటంతో అతడి ట్రాక్ రికార్డు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పోలీసులు పట్టుకొని రిమాండ్ కు పంపినా సరే.. జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేయటం అతడికి అలవాటు.

ఈ వెరైటీ దొంగకు గుంటూరులో మూడంతస్తుల భవనం ఉందని.. దొంగతనం చేసిన బంగారాన్ని.. వెండిని ఎక్కడా అమ్మకుండా ఇంట్లోనే దాచుకోవటం ఇతనికి ఉన్న ప్రధాన అలవాటుగా చెబుతున్నారు. తాను చోరీ చేసిన సొత్తును ఏ మాత్రం చెడగొట్టకుండా జాగ్రత్తగా దాయటం కూడా ఒక అలవాటు. తాజాగా అతని నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం.. వెండి విలువ తెలిస్తే నోటి వెంట మాట రాదంతే. నిందితుడి వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువైన బంగారం.. పది కేజీల్ వెండి ఆభరణాలతో పాటు రూ.18వేల నగదును రికవరీ చేశారు. ఏమైనా ఈ తరహా వెరైటీ దొంగలు చాలా తక్కువగా కనిపిస్తుంటారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News