రొడ్డు కొట్టుడు స్పీచ్ లు కాదు..ఇలాంటివి చూడు బాబు

Update: 2018-05-28 15:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి త‌ర‌చూ ఒక ఫిర్యాదు ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. మంత్రులు మొద‌లుకొని సొంత పార్టీ లీడ‌ర్ల వ‌ర‌కూ.. కొమ్ములు తిరిగిన అధికారులతో పాటు కీల‌క పార్టీ నేత‌ల‌కు సైతం అందుబాటులో ఉండ‌ర‌ని చెబుతుంటారు. ఆయ‌న అపాయింట్ మెంట్ దొర‌క‌టం సాధ్యం కాద‌ని.. ఆయ‌న‌కు ఆయ‌న ఏమైనా అవ‌స‌రం ప‌డితే పిలిపించుకుంటార‌ని.. అప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ కోసం వెయిట్ చేయ‌ట‌మే త‌ప్పించి మ‌రింకే మార్గం లేద‌ని చెబుతుంటారు.

మ‌రింత క‌ష్ట‌మైన కేసీఆర్ ద‌ర్శ‌నాన్ని.. అప్పుడ‌ప్పుడు కొంద‌రు బాధితులు.. క‌ష్టాల్లో ఉన్న వారు ఇట్టే క‌ల‌వ‌ట‌మే కాదు..వారి క‌ష్టాల్ని త‌న సంత‌కంతో తీర్చే వైనాలు అప్పుడ‌ప్పుడు మీడియాలో వ‌స్తుంటాయి. మంత్రుల‌కు సైతం దొర‌క‌ని కేసీఆర్.. సామాన్యుల‌కు.. అందునా క‌ష్టాల్లో ఉన్న బాధితుల‌కు ఎలా క‌లుస్తారంటే.. అదే కేసీఆర్ గొప్ప‌త‌నంగా చెప్పాలి. ఎవ‌రికి త‌న అవ‌స‌రం ఉందో.. వారిలో కొంద‌రినైనా త‌ప్ప‌నిస‌రిగా క‌లిసేలా కొంత వ్య‌వ‌స్థ‌ను సెట‌ప్ చేసుకున్న‌ట్లుగా కేసీఆర్ కు పేరుంది.

గ‌తంలో తొమ్మిదిన్న‌రేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించి.. రెండో ద‌ఫాలో నాలుగేళ్లుగా సీఎం కుర్చీలోకూర్చున్న చంద్ర‌బాబును పార్టీ నేత‌లు.. బ‌డా వ్యాపారులు.. ఇలా అన్ని వ‌ర్గాల వారు క‌లుసుకోగ‌లుతారు. కానీ.. సామాన్యులు.. క‌ష్టాల్లో ఉన్న వారికి మాత్రం ఆయ‌న ద‌ర్శ‌నం అస్స‌లు ల‌భించ‌దు. తాజాగా వైభోగంగా సాగుతున్న మ‌హానాడులోనే చూడండి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లుసుకోవ‌టం కోసం ఆయ‌న సొంత జిల్లాకు చెందిన ఒక మ‌హిళ‌.. త‌న పిల్ల‌ల్ని ప‌ట్టుకొని మ‌రీ త‌న గోడు వెళ్ల‌బోసుకోవ‌టానికి వెయిట్ చేస్తోంది. కానీ.. బాబును క‌లిసే అవ‌కాశం మాత్రం అస్స‌లు ల‌భించ‌ని దుస్థితి. ఇక్క‌డ మ‌రోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకురావాలి.

త‌న‌ను క‌లుసుకోవ‌టానికి వ‌చ్చే త‌న సొంత జిల్లా వాళ్ల‌కు.. తాను పెరిగిన గ్రామానికి చెందిన వారిని వెంట‌నే క‌లిసే అల‌వాటు కేసీఆర్‌ లో క‌నిపిస్తుంది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబులో మాత్రం ఈ తీరు క‌నిపించ‌దు. చిత్తూరు జిల్లా తిరుప‌తికి స‌మీపంలోని రేణిగుంట‌కు చెందిన ల‌క్ష్మీ త‌న ఇద్ద‌రు కుమార్తెల్ని వెంట పెట్టుకొని విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న మ‌హానాడుకు వెళ్లారు. అక్క‌డ చంద్ర‌బాబు మాట్లాడే స‌మ‌యంలో ఆయ‌న్ను క‌లిసేందుకు విఫ‌ల య‌త్నం చేశారు.

వారిని పోలీసులు బ‌ల‌వంతంగా ఆపేశారు. ఒక్క‌సారి తాము సీఎంను క‌ల‌వాల‌ని.. త‌మ గోడును వెళ్ల‌బోసుకోవాల‌ని వారు వాపోతున్నారు. త‌మ ఇంటిని క‌బ్జా చేశార‌ని.. ఇద్ద‌రు కూతుళ్ల‌తో ఐదేళ్లుగా రోడ్డుపైనే జీవ‌నం సాగిస్తున్నాన‌ని.. త‌మ ఊరి స‌ర్పంచ్.. రెవెన్యూ అధికారులే త‌మ ఇంటి నుంచి త‌మ‌ను గెంటేసిన‌ట్లుగా వారు వాపోతున్నారు. సీఎంను క‌లిసి త‌మ గోడును వెళ్ల‌బోసుకోవ‌టానికి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. కానీ.. ఆ అవ‌కాశాన్ని భ‌ద్ర‌తా సిబ్బంది క‌ల్పించ‌లేదు. ఇప్ప‌టికైనా స్పందించి.. త‌న‌ను క‌లుసుకోవ‌టానికి వ‌చ్చిన బాధితురాలితో మాట్లాడితే మంచిద‌న్న అభిప్రాయం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.సీఎం సొంత జిల్లా వారు సైతం.. చంద్ర‌బాబును క‌ల‌వ‌లేక‌పోవటం ఏమిటి?
Tags:    

Similar News