ల‌క్ష్మీస్‌* ఎఫెక్ట్‌!,,, క‌డ‌ప జేసీపై దెబ్బ ప‌డింది!

Update: 2019-05-14 11:29 GMT
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ‌... ఎన్టీఆర్ బ‌యోపిక్ పేరిట తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం టీడీపీ నేత‌ల‌ను దెబ్బ కొట్ట లేదు గానీ...ఈ  వివాదంతో ఎంత‌మాత్రం సంబంధం లేని ఓ ఐఏఎస్ అధికారిని మాత్రం గ‌ట్టి దెబ్బ కొట్టేసింది. ఏపీలో ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు కాస్తంత ముందుగా ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే... టీడీపీకి ఎంతో కొంత మేర న‌ష్టం త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపించింది. అయితే టీడీపీ ఫిర్యాదులో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ సినిమా రిలీజ్ ను ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే దాకా వాయిదా వేసింది.

ఈ క్ర‌మంలో వ‌ర్మ కోర్టును ఆశ్ర‌యించ‌డం, మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు ఎక్క‌డిక‌క్కడ వ‌ర్మ‌పై ఫిర్యాదులు చేయ‌డంతో కోర్టు తీర్పుల్లోనూ కొంత వైరుధ్యం క‌నిపించింద‌న్న మాట వినిపించింది. సినిమా రిలీజ్ పైనే ఈ వైరుధ్యం క‌నిపించ‌గా... కొన్ని ప్రాంతాల్లో సినిమాను రిలీజ్ చేసేసిన చిత్ర యూనిట్ కొన్ని షోలు కూడా వేసేసింది. అయితే ఈ సినిమాపై తీర్పులు వెలువ‌రించిన కోర్టుల్లో ఉన్న‌త న్యాయ‌స్థానంగా ఉన్న హైకోర్టు, కోడ్ అమ‌ల్లో ఉండ‌గా స‌ర్వాధికారాలు క‌లిగిన ఈసీ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ క‌దా. ఈ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోని కొంద‌రు అధికారులు ఈ సినిమా విష‌యం త‌మ‌కెందుకులే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. ఇందులో భాగంగానే ఈ సినిమాపై నిషేధం ఉన్నా... తన ప‌రిధిలోని కొన్ని థియేట‌ర్ల‌లో సినిమా ఆడుతున్నా క‌డ‌ప జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా ఉన్న కోటేశ్వ‌ర‌రావు అడ్డుకోలేక‌పోయారు.

ఫ‌లితంగా నిషేధం ఉన్న సినిమా ఆడుతున్నా చేతులు క‌ట్టుకుని కూర్చున్నారా? అంటూ కోటేశ్వ‌ర‌రావుపై క‌న్నెర్ర‌జేసిన ఈసీ... ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంది. ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోస్టులో ఆయ‌న‌ను ఉంచ‌రాద‌ని, త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల‌కు సంబంధం లేని పోస్టులో నియ‌మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. క‌డ‌పలోని ఓ థియేట‌ర్‌తో పాటు రైల్వే కోడూరు, రాజంపేటల‌కు చెందిన మ‌రో రెండు థియేట‌ర్ల‌లో ఈ సినిమా ఒక‌టి, రెండు షోల చొప్పున ఆడింది. అయితే అప్ప‌టికే నిషేధాజ్ఞ‌లు ఉన్న సినిమా థియేట‌ర్ల‌లో ఆడుతుంటే అడ్డుకోలేక‌పోయార‌ని కోటేశ్వ‌ర‌రావుపై ఈసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మొత్తంగా టీడీపీకి దెబ్బేయాల‌ని వ‌ర్మ అనుకుంటే... ఇప్పుటు ఆ దెబ్బ ఈ వివాదంతో ఎంత‌మాత్రం సంబంధం లేని అధికారికి త‌గిలింద‌న్న మాట‌.  
    

Tags:    

Similar News