బ‌తికున్న మ‌హిళా రైతును చంపేశారు.. రైతుబంధు ఎత్తేసుకున్నారు!

Update: 2021-07-23 10:30 GMT
రాష్ట్రప్ర‌భుత్వం తెచ్చిన రైతుబంధు ప‌థ‌కాన్ని అధికార పార్టీ నాయ‌కుడితో క‌లిసి అధికారులు మింగేసిన ఘ‌ట‌న వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మ‌హిళా రైతు బ‌తికి ఉండ‌గానే.. ఆమె చ‌నిపోయిన‌ట్టుగా రికార్డుల్లో న‌మోదు చేసి, రైతుబంధు బీమా సొమ్ము 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను కాజేశారు. ఈ విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్న బాధితురాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే...

వికారాబాద్ జిల్లా కుల్క‌చ‌ర్ల మండ‌లం, పుట్టాప‌హాడ్ గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్ర‌మ్మ అనే మ‌హిళా రైతు పేరిట ఎక‌రం 30గుంట‌ల భూమి ఉంది. రైతుబంధు ప‌థ‌కానికి అప్లై చేసుకున్న ఆమెకు.. గ‌తంలో దానికి సంబంధించిన న‌గ‌దు అందింది. అయితే.. గ‌డిచిన రెండు విడ‌త‌లుగా ఆమెకు రైతు బంధు న‌గ‌దు అంద‌ట్లేదు. ఈ విష‌య‌మై ఆమె కుమారుడు బాల‌య్య‌ తాజాగా.. వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌ను క‌లిశాడు.

త‌న త‌ల్లికి రెండు ద‌ఫాలుగా రావాల్సిన రైతు బంధు ప‌థ‌కం అంద‌లేద‌ని, కార‌ణ‌మేంటో చెప్పాల‌ని అడిగాడు. ప‌రిశీలించిన వ్య‌వ‌సాయ అధికారి.. చంద్ర‌మ్మ చ‌నిపోయింద‌ని, 2020 సెప్టెంబ‌రు 14న ఆమె చ‌నిపోయిన‌ట్టు రికార్డుల్లో న‌మోదైంద‌ని చెప్పారు. దీంతో.. ఆమె పేరిట వ‌చ్చిన బీమా సొమ్ము రూ.5 ల‌క్ష‌ల‌ను బాల‌య్య అకౌంట్లో జ‌మ చేసిన‌ట్టు చెప్పారు.

చంద్ర‌మ్మ బీమాకు నామినీగా కొడుకు బాల‌య్య పేరునే న‌మోదు చేసింది. దీంతో.. నీ పేరునే నీ అకౌంట్లోనే డ‌బ్బు జ‌మ అయ్యింద‌ని వ్య‌వ‌సాయాధికారి చెప్పారు. ఈంతో.. హ‌డావిడిగా బ్యాంకు వ‌ద్ద‌కు వెళ్లి ఖాతాను ప‌రిశీలించాడు బాల‌య్య‌. అది చూసి షాక‌య్యాడు. గ‌తేడాది డిసెంబ‌ర్‌లోనే రూ.5 ల‌క్ష‌లు బాల‌య్య ఖాతాలో జ‌మ అయిన‌ట్టుగా ఉంది. అంతేకాదు.. ఆ డ‌బ్బును నాలుగు విడ‌త‌లుగా వేరే అకౌంట్లోకి మారిన‌ట్టు తేలింది. ఈ దందా మొత్తం టీఆర్ఎస్ నేత‌, రైతు బంధు కో-ఆర్డినేట‌ర్ రాఘ‌వేంద్ర‌రెడ్డి ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగింద‌ని బాధితులు ఆరోపించారు.
Tags:    

Similar News