సీబీఐకి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడి లేఖ

Update: 2021-11-18 07:35 GMT
మాజీమంత్రి వివేకా హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్య కేసులో తన తండ్రికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మూడు రోజులు క్రితమే తన తండ్రి భుజానికి సర్జరీ జరిగిందని, ఇంకా ఆయన కోలుకోలేదని లేఖలో ప్రస్తావించారు. ఆయన తన వ్యక్తగత పనులు కూడా చేసుకోలేరని తెలిపారు. తమకు న్యాయం చేయాలని శివశంకర్ రెడ్డి కుమారుడు సీబీఐని లేఖలో కోరారు.

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అప్రూవర్‌ గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు వేగం పెంచారు. వివేకా కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌ లోని ఓ ఆస్పత్రిలో శివశంకర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చింది. ఎంపీ అవినాష్ రెడ్డికి శివశంకర్ రెడ్డి ముఖ్య అనుచరుడని దస్తగిరి కన్ఫేషన్ స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించారు. దీంతో విచారణకు రావాలని శివశంకర్ రెడ్డికి ఈనెల 15న సీబీఐ నోటీసులు ఇచ్చింది.

అయితే అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనని సీబీఐకి చెప్పారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శివశంకర్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ రెడ్డి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ కోసం సికింద్రాబాద్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో శివశంకర్ రెడ్డిని కడపకు తరలించారు.

కడప జిల్లా లింగాల మండలం దొండ్ల వాగు గ్రామానికి చెందిన దేవి రెడ్డి మల్లారెడ్డి కుమారుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి. చిన్నప్పుడే పులివెందుల పట్టణానికి వచ్చిన శివశంకర్‌ రెడ్డి వైఎస్‌ కుటుంబానికి దగ్గరయ్యాడు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అవినాశ్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమైన వైసీపీ నాయకుల్లో శివశంకర్‌ రెడ్డి ఒకరు.
Tags:    

Similar News