24 ఏళ్ల త‌ర్వాత న్యాయం..క్ష‌మాప‌ణ చెప్పిన హైకోర్టు

Update: 2017-08-06 10:43 GMT
న్యాయ‌వ్య‌వ‌స్థ‌లోనే ఇదో అరుదైన ఘ‌ట‌న‌. త‌న కొడుకు మృతికి ప‌రిహారం కోసం 24 ఏళ్లుగా పోరాడుతున్న ఓ మ‌హిళ‌కు మ‌ద్రాస్ హైకోర్టు క్ష‌మాప‌ణ చెప్పింది. న్యాయం కోసం ఇన్నేళ్లు వేచి చూసేలా చేసినందుకు క్ష‌మించాలి అని కోర్టు ఆమెను కోర‌డం గ‌మ‌నార్హం. 1993లో త‌న కొడుకును రోడ్డు ప్ర‌మాదంలో కోల్పోయింది ఆ త‌ల్లి. అప్ప‌టి నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ ప‌రిహారం కోసం పోరాడుతూనే ఉంది. మొత్తానికి ఇన్నాళ్ల‌కు ఆమె పోరాటం ఫ‌లించింది. ఈ సంద‌ర్భంగానే న్యాయ‌మూర్తి ఎన్ శేష‌సాయి ఆ మ‌హిళ‌కు క్ష‌మాప‌ణ చెప్పారు.

1993, మే 18న బ‌క్కియ‌మ్ అనే ఈ మ‌హిళ కొడుకు లోకేశ్వ‌ర‌న్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. అత‌డు లారీ న‌డుపుతుండ‌గా.. ఓ ఆర్టీసీ బ‌స్సు ఢీకొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. అయితే మోటార్ వెహికిల్స్ చ‌ట్టం కింద అత‌ని త‌ల్లి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించ‌కుండా.. వ‌ర్క్‌మెన్స్ కంపెన్సేష‌న్ చ‌ట్టం కింద ప‌రిహారం ఇవ్వాల‌ని కేసు వేసింది. ప‌రిశ్ర‌మల్లో మ‌ర‌ణించేవారికే ఈ చ‌ట్టం కింద ప‌రిహారం ఇస్తారు కాబ‌ట్టి.. ఆమె పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసింది. ఆ త‌ర్వాత ఆమె అప్పీల్ కోసం ప్ర‌య‌త్నించ‌కుండా.. మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యున‌ల్ కింద త‌న‌కు ఐదు ల‌క్ష‌లు ఇవ్వాల్సిందిగా కొత్త పిటిష‌న్ దాఖ‌లు చేసింది. అయితే మొద‌ట డ‌బ్ల్యూసీ చ‌ట్టం కింద పిటిష‌న్ వేసి.. ఇప్పుడు ఎంఏసీటీ కింద వేయ‌డం కుద‌ర‌ద‌ని లారీ ఇన్సూరెన్స్ ఇచ్చిన నేష‌న‌ల్ ఇన్సూరెన్స్ కంప‌నీ వాదించింది. అయితే ట్రిబ్యున‌ల్ మాత్రం కంపెనీ వాద‌నను తోసిపుచ్చి.. రూ.3.47 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించింది. దీనిపై కంపెనీ హైకోర్టుకు వెళ్ల‌గా.. జ‌స్టిస్ శేష‌సాయి కూడా సంస్థ వాద‌న‌ను కొట్టేశారు. నాలుగు వారాల్లోగా ఈ డ‌బ్బు ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగానే న్యాయ‌మూర్తి క్ష‌మాప‌ణ‌లు తెలిపారు.
Tags:    

Similar News