రాజీనామా తర్వాత మహామూర్తి సంచలనం

Update: 2018-09-15 06:10 GMT
మహాన్యూస్ లో సీఈవో కం ఎడిటర్ గా వ్యవహరించిన  మూర్తి ఎట్టకేలకు మౌనం వీడారు. కాపులతో పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించిన రహస్య సమావేశాన్ని తన చానెల్ లో మూర్తి బయటపెట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పూర్తి కథనాన్ని  మహా న్యూస్ చానెల్ యాజమాన్యం ప్రసారం చేయకుండా  అడ్డుకుందని.. అందుకే ఆ చానెల్ కు రాజీనామా చేసి బయటకు వచ్చానని మూర్తి తెలిపారు.  ఈ సందర్భంగా పవన్ సిద్ధాంతాలు, మాటలు వేరని.. చేసే పనులు వేరని మూర్తి నిప్పులు చెరిగారు..

మూర్తి తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.. మూర్తి మాట్లాడుతూ..  పవన్ కళ్యాణ్ కొత్త తరహా రాజకీయాన్ని తీసుకొస్తారని నమ్మిన వారిలో తాను ఒకడినని పేర్కొన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ కేవలం కాపులతోనే రహస్య సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో తాను కూడా తొలుత నమ్మలేదని వివరించారు. అందుకే నేరుగా తానే మారువేషం వేసుకొని మరో రూపంలో అక్కడికి వెళ్లి అంతా చూశానని తెలిపారు. అది ముమ్మాటికీ రహస్య సమావేశం అని నిర్ణారణ చేసుకున్నానని వివరించారు. కాపులను మాత్రమే ఆ భేటికి ఆహ్వానించారని తెలిపారు. కాపులను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించారని.. అక్కడికి వచ్చిన వారి మాటలను కూడా ఆయన సోషల్ మీడియాలో చూపించారు..

పవన్ చెప్పిన సిద్ధాంతాలకు విరుద్ధంగా చెక్ రూపంలో కాకుండా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని.. మూర్తి మండిపడ్డారు. సమావేశానికి వచ్చిన వారి నుంచి 10 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారన్నారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని.. సమావేశానికి వచ్చిన పవన్ అక్కడ ఏం మాట్లాడారు..? ఇతర కాపులు ఏం ప్రసంగించారు అన్న దానిపై తన వద్ద వీడియో కూడా ఉందని మూర్తి బాంబు పేల్చారు. కానీ వాటిని తాను బయటపెట్టలేదని.. జనసేనపై కక్ష ఉంటే.. తాను అమ్ముడుపోయి ఉంటే వాటిని బయటపెట్టేవాడినని మూర్తి తెలిపారు. జనసేన ఒక కులపార్టీగా మారడం బాధ కలిగించిందన్నారు. జనసేనలో ఉన్న ప్రధాన వ్యక్తులంతా ఒకే సామాజికవర్గం కాదా అని పవన్ ఫ్యాన్స్ తనను దారుణంగా ట్రోలింగ్ చేయడాన్ని తప్పు పట్టారు. తన వద్ద జనసేనకు సంబంధించిన వీడియోలు, ఆధారాలు చాలా ఉన్నాయని.. తనపై పవన్ ఫ్యాన్స్ చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.  తాను రాష్ట్రంలోని ఏ ప్రముఖ రాజకీయ నాయకుడి కులానికి చెందిన వాడిని కాదని.. తనకు కుల పిచ్చి లేదని వివరణ ఇచ్చారు.

జనసేనలోని ప్రధాన కార్యదర్శి, అవినీతి కేసులున్న మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం, మీడియా హెడ్ హరిప్రసాద్, అధికార ప్రతినిధులు విజయబాబు , అద్దెపల్లి శ్రీధర్, శివశంకర్ వీరంతా ఒకే సామాజికవర్గం వారే కదా అని మూర్తి ప్రశ్నించారు.

చానెల్ యాజమాన్యమే తన మీడియా స్వచ్ఛను హరించిందని.. తన దూకుడుతో మహాన్యూస్ చానెల్ మూతపడడం.. సిబ్బంది ఇబ్బంది పడడం ఇష్టం లేకనే గాయపడ్డ సైనికుడిగా బయటకు వచ్చానని.. మూర్తి వాపోయారు. చానెల్ యాజమాన్యమే తనను వెనకనుంచి కాల్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నిలబడి తట్టుకుంటానని వివరించారు. ఉడత ఊపులకు తాను భయపడేది లేదన్నారు. కాపులతో పవన్ సమావేశంపై తాను చెప్పిన విషయాలు నిజం కాదని జనసేన చెబితే పవన్ కళ్యాన్ కు చెందిన 99 చానెల్ లో చర్చకు కూడా సిద్ధమని మూర్తి సవాల్ విసిరారు.

జనసేన రహస్య సమావేశం.. పవన్ వైఖరి గురించి మూర్తి  చెప్పిన సంచలన విషయాలు ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారాయి. మూర్తి మాట్లాడిన మాటలను కింద వీడియోలో చూడొచ్చు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News