కేసీఆర్ మ‌న‌సు దోచిన న‌వ్యాంధ్ర జిల్లా ఇదే!

Update: 2017-03-30 05:10 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ఏపీలోని ఓ జిల్లా విశేషంగా ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. ఎందుకంటే... రాష్ట్ర విభ‌జ‌న జరిగి మూడేళ్లు దాటుతున్నా కూడా ఏపీలోకి వెళ్లిపోయిన ఆ జిల్లాను కేసీఆర్ మ‌రిచిపోలేక‌పోతున్నారు. అంతేకాదండోయ్‌... ఆ జిల్లా త‌న‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో కూడా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెప్పారు. ఆ జిల్లా అంటే... అన్న‌పూర్ణేన‌న్న కోణంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే ఆస‌క్తి రేకెత్తించేలానే ఉన్నాయి. అయినా కేసీఆర్ మ‌న‌సు దోచిన జిల్లా ఏద‌నేగా మీ డౌటు? ఆ జిల్లా ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా. చారిత్ర‌క న‌గ‌రం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంతో పాటు కాకినాడను త‌న‌లో ఇముడ్చుకున్న తూర్పుగోదావ‌రి జిల్లా. గోదావ‌రి తీరానికి ఓ వైపున ఉండే ఈ జిల్లా నిజంగానే అన్న‌పూర్ణ కిందే లెక్క‌. గోదావ‌రి జ‌లాల‌తో ఈ జిల్లాలో సాగు లాభ‌సాటిగా సాగ‌డ‌మే కాకుండా... ప‌చ్చ‌ని పొలాల‌తో నిత్యం అల‌రారుతోంది. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు రాకూడ‌ద‌నే భావ‌న‌తో తెలంగాణ నుంచి ఏపీలో క‌లిసిన ఏడు మండ‌లాల్లో మెజారిటీ గ్రామాల‌ను త‌న‌లో క‌లిపేసుకున్న జిల్లాగానూ ఈ జిల్లాకు పేరుంది. అయినా ఇప్పుడు ఈ జిల్లా కేసీఆర్‌ కు ఎందుకు గుర్తుకు వ‌చ్చిన‌ట్లు? ఆ జిల్లాను కీర్తిస్తూ కేసీఆర్ ఎందుకు వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు? ... అంటే ఈ క‌థ‌కు చాలానే కార‌ణాలున్నాయి.

ఇక అస‌లు క‌థ‌లోకి వెళితే... తెలంగాణ‌లోని పాల‌మూరు జిల్లాగా పేరుప‌డ్డ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా క‌రువు జిల్లానే. ఇప్పుడైతే మూడు జిల్లాలుగా ఆ జిల్లా ముక్కలైంది గానీ... అంత‌కుముందు విస్తీర్ణంలో పెద్ద జిల్లాగా,. క‌రువుకు కేరాఫ్ అడ్రెస్‌ గా, వ‌ల‌స‌ల‌కు పెట్టింది పేరుగా ఆ జిల్లా రికార్డుల‌కెక్కింది. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌... మొన్నామ‌ధ్య  జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌తో పాల‌మూరు జిల్లాను మూడు జిల్లాలుగా చేశారు. అంత‌కుముందే... ఆ జిల్లాలోని క‌రువును త‌రిమివేసి, వ‌ల‌స‌ల‌కు చెక్ పెట్టేందుకు పాల‌మూరు- రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో పాటు డిండి ప్రాజెక్టును కూడా చేపట్టాల‌ని త‌ల‌చారు. ఈ ప్రాజెక్టుల‌తో పాటు మ‌రో రెండు, మూడు చిన్న ప్రాజెక్టుల‌ను కూడా ఆ జిల్లాలో నిర్మించాల‌ని కేసీఆర్ స‌ర్కారు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. కృష్ణా న‌దీ జ‌లాల ఆధారంగా నిర్మించాల‌ని భావిస్తున్న ఈ ప్రాజెక్టుల‌పై ఏపీ నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రాజెక్టుల‌పై త‌న‌దైన శైలి వాద‌న‌ను వినిపించింది.

ఈ క్ర‌మంలో ఇక‌పై కాంగ్రెస్ నుంచి ఈ ప్రాజెక్టుల‌కు సంబంధించి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకూడ‌ద‌ని భావించిన కేసీఆర్‌... నిన్న ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ప్ర‌త్యేకంగా త‌న ఇంటికి పిలిచి విందు ఇచ్చి మ‌రీ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న నోటి నుంచి తూర్పుగోదావ‌రి జిల్లా పేరు వినిపించింది. గోదావ‌రి జ‌లాల‌తో తూర్పుగోదావ‌రి జిల్లా ఎలా అన్న‌పూర్ణగా ఎదిగిందో... కృష్ణా జ‌లాల‌తో పాల‌మూరు జిల్లాను అలాగే తెలంగాణ అన్న‌పూర్ణ‌గా తీర్చిదిద్దుతామ‌ని పేర్కొన్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో వ‌ల‌స‌ల‌న్న మాటే ఉండ‌ద‌ని, ఇక‌పై పాల‌మూరు జిల్లా నుంచి కూడా వ‌ల‌స‌లు వెళ్ల‌కుండా జ‌నానికి అక్క‌డే ఉపాధి ల‌భించేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. తాము ప్ర‌తిపాదించిన ప్రాజెక్టుల‌న్నీ పూర్తి అయితే... పాల‌మూరు జిల్లా తూర్పుగోదావ‌రి జిల్లాను మ‌రిపిస్తుంద‌ని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News