టీడీపీ నుంచి ద‌ళితులు బ‌య‌ట‌కు వ‌చ్చేయాలి

Update: 2017-09-28 11:29 GMT
ద‌ళితుల ప‌ట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర వివ‌క్ష చూపుతోంద‌ని మాల మ‌హానాడు నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. త‌మ ప‌ట్ల పార్టీ స‌వ‌తి ప్రేమ‌ను చూపుతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎస్సీలంద‌రూ వెంట‌నే తెలుగుదేశం పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని మాలమహానాడు జాతీయాధ్యక్షుడు కల్లూరి చెంగయ్య పిలుపునిచ్చారు. టీడీపీలో మాల‌ - మాదిగ ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని చెప్పారు.  పార్టీలో మాల - మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు - నామినేటెడ్‌ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. విజ‌య‌వాడ‌లో బుధ‌వారం జరిగిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

చంద్ర‌బాబు హ‌యాంలో ద‌ళితుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని చెంగ‌య్య అన్నారు. చంద్ర‌బాబు కేబినెట్ లో దళితుల‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌న్నారు. గ‌తంలో ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు ద‌ళితుల‌కు పార్టీలో - ప‌దవుల్లో పెద్ద‌పీట వేసేవార‌ని గుర్తు చేశారు.

ఎన్టీఆర్ హయాంలో ఆర్ అండ్ బీ - రెవెన్యూ - భారీ నీటిపారుదల శాఖ వంటి కీల‌క‌మైన శాఖ‌ల‌ను దళితులకు కేటాయించారని చెప్పారు. ప్ర‌స్తుతం  చంద్రబాబు పాల‌న‌లో త‌మ‌కు క‌నీస విలువ ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. త‌మ‌కు సరైన ప్రాతినిథ్యం లేకుండా పోయిందని చెంగయ్య మండిపడ్డారు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ వారికి కేబినెట్ లో చోటుక‌ల్పించ‌డం పోయి - పొలిట్ బ్యూరో నుంచి దళిత ఎంపీ శివప్రసాద్‌ ను తొలగించ‌డం అన్యాయ‌మ‌న్నారు. కేవ‌లం వివ‌క్షాపూరిత ధోర‌ణితోనే చంద్ర‌బాబు ఇలా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు.కాపు సామాజికవర్గీయుల మెప్పు కోసం మంత్రివర్గం నుంచి పీతల సుజాతను తొలగించారని అన్నారు. అస‌లు గిరిజనమండలిని ఏర్పాటు చేసే ఉద్దేశం చంద్ర‌బాబుకు లేద‌న్నారు. వైసీపీ అధినేత జగన్ ఒత్తిడి వల్లే ఆ మండలిని ఏర్పాటు చేశారన్నారు.

కాగా, మూడేళ్లకు పైగా నాన్చిన త‌ర్వాత కేవ‌లం కంటితుడుపు చర్యగా  రాష్ట్ర స్థాయి గిరిజన సలహా మండలిని చంద్ర‌బాబు ఏర్పాటు చేశార‌ని వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. రాజ్యాంగం ప్రకారం మండలిలో 20 మంది సభ్యులు ఉండాల‌ని, కానీ సీఎం తనకు అనుకూలంగా ఉండే తొత్తులను నియమించుకున్నారని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు... రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి గిరిజనులను దారుణంగా మోసగించారన్నారు. ఎమ్మెల్యేలు కాని 8 మందిని నియమించడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒత్తిడితో , కోర్టు జోక్యంతో ఈ మండలిని ఏర్పాటు చేశార‌న్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీఓ నెంబర్‌ 87 ప్రకారం అప్పట్లో కాంగ్రెస్ - టీఆర్‌ ఎస్ - సీపీఐ - సీపీఎంకు కూడా గిరిజన సలహా మండలిలో చోటు కల్పించారని తెలిపారు.
Tags:    

Similar News