రెండో రోజుకు భట్టి దీక్ష‌.. ఫ‌లితం లేద‌బ్బా

Update: 2019-06-09 10:13 GMT
తెలంగాణ‌లో ఇప్పుడు ఓ కొత్త ఒర‌వ‌డి కొన‌సాగుతోంది. విప‌క్ష‌మ‌న్న‌దే లేకుండా... విప‌క్ష పార్టీల టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను అధికార పార్టీ టీఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరిట లాగేస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో కొద్దోగొప్పో సీట్ల‌ను సాధించిన  టీడీపీని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ దాదాపుగా అడ్రెస్ లేకుండా చేశారు. అందుకోసం ఆయ‌న ఇదే ఆప‌రేష‌న్ ఆకర్ష్ ను ప్ర‌యోగించారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వంత వ‌చ్చింది. ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తుగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్ల‌ను గెలుచుకుంది. ఆ 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి అడ్రెస్ లేకుండా చేద్దామ‌న్న కేసీఆర్ ఆశ‌ల‌కు అనుగుణంగానే సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల‌న్న విజ్ఞ‌ప్తికి స్పీక‌ర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

ఈ ప‌రిణామంతోనే కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ గ‌ల్లంతైపోయిందని చెప్ప‌లేం గానీ... ఆ పార్టీకి ఇది చావుదెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ త‌ర‌హా చ‌ర్య‌పై కాంగ్రెస్ లో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతుండగా... సీఎల్పీ నేత‌గా ఉన్న మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.. ఏకంగా నిరాహార దీక్ష‌కు దిగారు. నిన్న దీక్ష‌ను ప్రారంభించిన దీక్ష‌ను రెండో రోజైన నేడు కూడా భ‌ట్టి కొన‌సాగిస్తున్నారు. న్యాయం జ‌రిగే దాకా దీక్ష విర‌మించేది లేద‌ని చెబుతూ పంతం బ‌ట్టిన భ‌ట్టి విక్ర‌మార్క‌... ఎన్ని రోజులు దీక్ష చేస్తార‌న్న‌ది ఇప్పుడు చెప్ప‌లేకున్నా... ఈ దీక్ష‌తో ఆయ‌న సాధించేదేమీ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే... కాంగ్రెస్ పార్టీ టికెట్ల మీద పోటీ చేసి విజ‌యం సాధించిన ఎమ్మెల్యేలు వారికి వారుగా పార్టీ మార‌డ‌మే కాకుండా... వారే త‌మ పార్టీని అధికార పార్టీలో విలీనం చేయాలంటూ ప్ర‌తిపాదిస్తే... అడ్డుకునే వారెవ‌రు?

అస‌లు ఇలాంటి పార్టీ పిరాయింపుల‌కు పాల్ప‌డే వారికి టికెట్లు నిరాక‌రించాల్సిన బాధ్య‌త కాంగ్రెస్ దేన‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... కాంగ్రెస్ పార్టీ ఓట్ల‌తో విజ‌యం సాదించిన వారు  ఆ పార్టీకి విధేయులుగానే ఉండాలి. ఒక‌వేళ వారు పార్టీ మారాల‌నుకుంటే... కాంగ్రెస్ పార్టీ ద్వారా ద‌క్కిన ప‌ద‌విని వ‌దిలేసి వెళ్లాలి. అలా కాకుండా త‌మ‌పై అనర్హ‌త వేటు ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డిన నేత‌లు... ఇప్పుడు సీఎల్పీ విలీనాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చారు. దీనిపై న్యాయ పోరాటం చేయాల్సిందే త‌ప్పించి, నిరాహార దీక్ష‌లతో పెద్ద‌గా ఒరిగేదేమీ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం ప‌క్కాగా అమ‌ల‌య్యేలా చేయ‌డం, లేదంటే చేయించ‌డం మిన‌హా దీక్ష‌ల‌తో ఒరిగేదేమీ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టికే రెండో రోజు కూడా దీక్ష కొన‌సాగిస్తున్న భ‌ట్టి విక్ర‌మార్క‌... ఈ నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి.  

    

Tags:    

Similar News