మమత ‘3’ రోజుల ముంబయి టూర్ రిజల్ట్ వచ్చేసింది

Update: 2021-12-08 05:30 GMT
రాజకీయాల్లో తొందరపాటు ఏ మాత్రం మంచిది కాదు. ఆచితూచి వేయాల్సిన అడుగుల్ని తొందరపడితే జరిగే నష్టం ఏమిటన్న విషయం తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి తాజాగా తెలిసి వచ్చి ఉంటుంది.

తనను కలిసేందుకు వచ్చే ముఖ్యమంత్రుల్ని.. మాజీ ముఖ్యమంత్రుల్ని తనదైన శైలిలో ట్రీట్ చేయటమే కాదు.. మమతమ్మ మామూలుదిగా కాదుగా? అన్న భావన కలిగేలా చేసే ఆమెకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. నువ్వే నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లుగా.. ఆమె కోసం వచ్చిన వారి విషయంలో ఆమె వ్యవహరించే విధానంలోనే.. తాజాగా ఆమె తన అవసరానికి చేసిన ప్రయత్నానికి అలాంటి ఫలితమే వచ్చింది.

జాతీయ స్థాయిలో మోడీ సర్కారుకు వ్యతిరేకంగా జట్టు కట్టాలన్న తపన మమతలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అయితే.. మోడీ మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీని కూడా దూరం చేసి.. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది ఆమె ఆశ.

అందుకు తగ్గట్లే.. పశ్చిమ బెంగాల్ ను పెద్దగా వీడని ఆమె.. తాజాగా మహారాష్ట్రలో మూడురోజుల పాటు పర్యటించటమే కాదు.. అక్కడి అధికారపక్షం (ఎన్సీపీ.. శివసేన.. కాంగ్రెస్)లోని సేన.. ఎన్సీపీ కీలక నేతలతో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో బీజేపీ.. కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా జట్టు కట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

అయితే.. దీదీ కోరుకున్నట్లుగా జరగదన్న సంకేతాలు ఆమె పర్యటనలోనే బయటకు వచ్చినా.. తాజాగా ఆమె టూర్ భారీ డిజాస్టర్ అన్న విషయం తేలిపోయింది. తాజాగా న్యూఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లేని విపక్షాల కూటమి అసాధ్యమని తేల్చేశారు.

దీంతో..కాంగ్రెస్ లేని విపక్షాల కూటమి కోసం యత్నిస్తున్న దీదీకి ఈ వ్యాఖ్య భారీ దెబ్బగా పలువురు అభివర్ణిస్తున్నారు. అంతేకాదు.. సంజయ్ రౌత్ మాట్లాడుతూ..2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో విపక్షాలు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ముంబయిలో మూడు రోజులు పర్యటించిన మమతా బెనర్జీ మాట్లాడుతూ.. యూపీఏ ఎక్కడ ఉంది? అని వ్యాఖ్యానించటం రాజకీయ కలకలానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ లేని విపక్ష కూటమిని జట్టు కట్టే ప్రయత్నం చేస్తున్న మమతకు.. తాజా పరిణామాలు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.

ఆదిలోనే హంసపాదు అన్న చందంగా.. సంజయ్ రౌత్ మాటలు ఉన్నాయని చెప్పాలి. సేన ఇచ్చిన షాక్ మమతకు దిమ్మ తిరిగిపోయేలా ఉండటమే కాదు.. ఆమె స్వయంగా నడుం బిగించి జట్టు కట్టాలన్నది అంత తేలికైన విషయం కాదని తేలిపోయింది. మరోవైపు ఈసారి విపక్ష కూటమిలో సమాజ్ వాదీ పార్టీని కలుపుకోవాలని ఎన్సీపీ భావిస్తోంది. చూస్తుంటే.. కాంగ్రెస్ తో కూడిన కూటమి తప్పించి.. మమత కోరుకున్నట్లుగా కొత్త జట్టు సాధ్యం కాదన్న విషయాన్నిసంజయ్ రౌత్ వ్యాఖ్యలతో స్పష్టమైనట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News