దీదీ రీసౌండ్‌!... హ‌జారే వాయిస్ వినిపించ‌లేదే!

Update: 2019-02-06 04:35 GMT
అన్నా హ‌జారే... దేశంలో సుప‌రిపాల‌న‌ - జ‌వాబుదారీత‌నం కోసం అహ‌ర్నిశ‌లు పాటుప‌డుతున్న స‌మున్న‌త‌మైన వ్య‌క్తి. దేశానికి స‌ర్వోత్త‌మ వ్య‌వ‌స్థ‌ను అందించేందుకు ఆయ‌న ప్ర‌తిపాదించిన లోక్ పాల్ బిల్లుకు అన్ని పార్టీల నుంచి కూడా దాదాపుగా మ‌ద్ద‌తు ఉంద‌నే చెప్పాలి. అయితే పిల్లి మెడ‌లో గంట ఎవ‌రు క‌డ‌తార‌న్న చందంగా ఈ బిల్లును ఆమోందించే విష‌యం ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. ఈ బిల్లుకు దాదాపుగా అన్ని రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు గ‌తంలో అన్నా హ‌జారే చేప‌ట్టిన దీక్ష దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఢిల్లీ ప్ర‌స్తుత సీఎం అరవింద్ కేజ్రీవాల్ - పుదుచ్ఛేరి గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీలు ఇప్పుడు రాజ‌కీయ రంగంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారంటే... నాడు అన్నా హ‌జారే చేసిన దీక్షే కార‌ణ‌మ‌ని చెప్పాలి. నాడు దీక్ష‌లో కూర్చున్న హ‌జారేకు కేజ్రీ - బేడీలు చెరోవైపు కూర్చుని క‌నిపించారు. నాడు హ‌జారే దీక్ష‌కు దేశ‌వ్యాప్త మ‌ద్ద‌తు ల‌భించింది. అన్ని మీడియా సంస్థ‌లు కూడా హ‌జారే కృషిని - అలుపెర‌గ‌ని పోరును చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించేందుకు సాహ‌సించ‌లేదు.

అయితే అవే మీడియా సంస్థ‌లు ఇప్పుడు త‌న సొంతూళ్లో హ‌జారే కొన‌సాగిస్తున్న దీక్ష‌పై మాత్రం శీత‌క‌న్నేశాయి. దేశంలోని ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో హ‌జారే దీక్ష‌కు సంబంధించి వార్త భూత‌ద్దం పెట్టి వెతికినా ఎక్క‌డో చిన్న ముక్క‌గా క‌నిపించే త‌ప్పించి పెద్ద‌గా ప్రాధాన్య‌మే ద‌క్క‌లేదు. వారం రోజులుగా దీక్ష చేస్తున్న హ‌జారే... నిన్న మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఇచ్చిన హామీతో నిన్న దీక్ష విర‌మించారు. స‌రే... వారం పాటు దీక్ష కొన‌సాగించిన హ‌జారే... ఫ‌డ్న‌వీస్ హామీతో దీక్ష‌ను విర‌మించినా... లోక్ పాల్ బిల్లు కోసం ఆయ‌న సాగించిన దీక్ష మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఎందుకు ప‌ట్ట‌లేదు. దీనికి కార‌ణంగా దీదీ స్ట్రీట్ ఫైటేన‌న్న కార‌ణం వినిపిస్తోంది. కేంద్రంపై త‌న‌దైన శైలిలో పోరు సాగిస్తున్న ప‌శ్చిమ బెంగాల్ సీఎం - తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ... మొన్న న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై దాదాపుగా తిరుగుబాటు చేసినంత ప‌ని చేశారు. శారదా చిట్ ఫండ్ కుంభ‌కోణంలో ప‌లు కీల‌క ఆధారాల‌ను ధ్వంసం చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌స్తుతం కోల్ క‌తా పోలీస్ క‌మిష‌న‌ర్‌ గా ఉన్న రాజీవ్ కుమార్‌ ను విచారించేందుకు అవ‌స‌ర‌మైతే... అరెస్ట్ చేసేందుకు సీబీఐ య‌త్నించింది.

అయితే అప్ప‌టికే సీబీఐకి జ‌న‌ర‌ల్ క‌న్సెంట్ ను ఉప‌సంహ‌రించుకున్న దీదీ... మోదీ స‌ర్కారుపైకి శివంగిలా దూకారు. త‌న అనుమ‌తి లేకుండా రాష్ట్రంలోకి ఎలా ప్ర‌వేశిస్తారంటూ సీబీఐ అధికారుల‌కు మ‌మ‌త చుక్క‌లు చూపించారు. పోలీస్ క‌మిష‌న‌ర్‌ను విచారించేందుకు వ‌చ్చిన సీబీఐ అధికారుల‌ను బెంగాల్ పోలీసులు ఏకంగా అరెస్ట్‌ చేసి పారేశారు. అయితే ఎక్క‌డ త‌న ప‌ట్టు త‌ప్పుతుందోన‌న్న భ‌యంతో దీదీ న‌డిరోడ్డుపైకి వ‌చ్చి దీక్ష‌కు దిగారు. దీంతో అక్క‌డ మోదీ వ‌ర్సెస్ దీదీ త‌ర‌హా ఫైట్ నిజంగానే వీధుల‌పైకి వ‌చ్చింది. ఈ ఫైట్‌ ను క‌వ‌ర్ చేసేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన మీడియా... దేశ సుప‌రిపాల‌న కోసం దీక్ష చేస్తున్న హజారే దీక్ష‌ను విస్మ‌రించింది. ఎంతైనా దీదీ స్ట్రీట్ ఫైట్ రీసౌండ్ చెవులు ద‌ద్ద‌రిల్లేలా విన‌ప‌డుతుంటే... మంచి మాస్ మ‌సాలాతో కూడిన వార్త‌ల‌ను వండేదుకు ఆస‌క్తి చూపిన మీడియా... హ‌జారే వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేక‌పోయింది.

   

Tags:    

Similar News