అపుడు చాయ్ వాలా...ఇపుడు పేటీఎం వాలా!

Update: 2016-12-20 06:15 GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.  ప‌శ్చిమ‌బెంగాల్ లోని బంకురా జిల్లాలో ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఆమె పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న బాధలను  సర్కార్ పట్టించుకోవడం లేదని  ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఆయన చాయ్ వాలా అనీ….ఇప్పుడు పేటిఎం వాలాగా మారిపోయారని మమత విమర్శించారు. ప్ర‌ధాన‌మంత్రి తీరును ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని మ‌మ‌త వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా నోట్ల రద్దుతో ప్రధాని మోడీ పేదల రక్తం పిండుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ లోని జానుపూర్‌ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాతే విజ‌య్ మాల్యాకు మోడీ వేలాది కోట్లు కానుక ఇచ్చారని రాహుల్‌ విమర్శించారు.

'నవంబర్‌ 8న మోడీ తీసుకున్న నిర్ణయం నల్లధనమో - లేక అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు. అది పేదలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం' అని రాహుల్‌ ఆరోపించారు. 'దేశం నుంచి అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలించాలని మేము కోరుకుంటున్నాం. అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ఉంటే, 100 శాతం మేము సమర్థించేవాళ్ళం. ఇది దేశంలోని 99 శాతం మందిగా ఉన్న రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం. వారి నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే వారి నరనరాల్లో ఉన్న రక్తాన్ని పీల్చి వేస్తున్నారు' అంటూ రాహుల్‌ మండిపడ్డారు.

కాగా రాహుల్ ప్ర‌సంగంలో  ఆయన ప్రసంగిస్తుండగా...  మోడీ ప్ర‌స్తావన‌ ప్రారంభంకాగానే, ప్రజల నుంచి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు మారుమోగాయి. ఇలా కార్య‌క‌ర్త‌లు మోడీకి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తుంటే... రాహుల్‌ వారిని నిలువరించారు. 'మోడీ మన దేశ ప్రధాని. మనం ఎవరినీ ముర్దాబాద్‌ అనకూడడు' అని రాహుల్‌ చెప్పారు.  'మోడీతో, బీజేపీతో మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ముర్దాబాద్‌ అన్న పదం ఉపయోగించకండి, నరేంద్రమోడీ మన దేశ ప్రధాని. అది ఆర్‌ఎస్‌ఎస్‌ వారి పదం. మనది కాదు' అని రాహుల్‌ ప్రజలను వారించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News