పాము వ‌చ్చింద‌ని ఫోన్‌..సీఎంకు షాకింగ్ రిప్లై!

Update: 2018-12-07 01:30 GMT
స‌హ‌జంగా ఎవ‌రి ఇంట్లోకైనా పాము వచ్చిందంటే ఏం చేస్తాం...ముందుగా భ‌య‌ప‌డిపోతాం...త‌ర్వాత ధైర్యం తెచ్చుకొని కొట్టి చంపేస్తాం. జంతు ప్రేమికులైతే...అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తారు. కానీ ఎమ్మెల్యేల‌కో..ఎంపికో ఫోన్ చేయ‌రు క‌దా?  కానీ చేశాడు ఓ ప్ర‌బుద్దుడు. ఎమ్మెల్యే ఎంపీకి కాదు... ఏకంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేశాడు. పాము నుండి రక్షించండి సీఎంగారూ అంటు ఏకంగా ఫోన్ కొట్టాడు. దానికి ఆ సీఎం గారు కూడా అదే స్థాయిలో అనూహ్య‌ మైన రిప్లై ఇచ్చారు!

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్రం - అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి ఇంట్లోకి ఓ త్రాచుపాము వచ్చింది. భయపడిన రాజా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాడు. స్పందించకపోవటంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఏకంగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. ఇదే ట్విస్ట్ అనుకుంటే...ఆ సీఎం గారు ఇంకా ట్విస్ట్ ఇచ్చారు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి రాజాకు ధైర్యం చెప్పారు. ఆయన అడ్రస్ తెలుసుకున్నారు. స‌ద‌రు వ్యాపారి రాజా ఇంటికి వెంటనే వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించి రాజా అడ్రస్ ను అటవీశాఖా అధికారులకు సీఎం నారాయణ స్వామి ఆదేశించారు. సీఎంగారి ఆదేశాలతో రాజా ఇంటికి వెళ్లిన వారు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పుదుచ్చేరిలో డిసెంబర్ 5వ తేదీన రాత్రి ఈ ఘ‌ట‌న‌ జరిగింది.

Tags:    

Similar News