15 ఏళ్ల క్రితం చంపాడు..తాజాగా దొరికాడు

Update: 2018-05-29 03:14 GMT
నేరం చేసిన వాడెవ‌డూ త‌ప్పించుకోలేదు. కాకుంటే కాస్త త్వ‌ర‌గా కొంత‌మంది.. కాస్త ఆల‌స్యంగా మ‌రికొంత‌మంది. అంతేకానీ.. ఏళ్లు గ‌డిచినా.. చేసిన పాపం వెంటాడ‌కుండా ఉండ‌దు. ఈ మాట‌కు బ‌లం చేకూరేలా ఒక సంచ‌ల‌న నిజం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమాటిక్ గా ఉండే ఈ ఉదంతంలోకి వెళితే..

ప‌దిహేనేళ్ల క్రితం భార్య‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండా చంపేసి.. డ్రైనేజీలో ప‌డేయ‌ట‌మే కాదు.. ఆమె అదృశ్య‌మైంద‌న్న విష‌యాన్ని న‌మ్మ‌కంగా చెప్పి.. అంద‌రిని న‌మ్మించాడు. చివ‌ర‌కు కేసు కూడా క్లోజ్ అయ్యింది. కానీ.. తాజాగా మ‌రో త‌ప్పు చేసి పోలీసుల‌కు దొరికిన అత‌గాడు.. విచార‌ణ‌లో గ‌తంలో (15ఏళ్ల క్రితం) తాను భార్య‌ను చంపేసి మూడో కంటికి తెలీకుండా జాగ్ర‌త్త‌ప‌డిన జాదూ.. తాజాగా దొరికిపోయాడు ఎలానంటే..

జ‌న‌గామ జిల్లా మొండ్రాయికి చెందిన మ‌ల్లికార్జున్ కు 16 ఏళ్ల క్రితం రెండో పెళ్లి జ‌రిగింది. మొద‌టి పెళ్లి మూణ్నాళ్ల ముచ్చ‌ట‌గా మిగిలిపోవ‌టం.. మొద‌టి భార్య‌తో సంబంధాలు తెగ‌తెంపులు చేసుకున్నారు. కొద్దికాలానికి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు కాపురం సాగినా.. నిత్యం కోట్లాట‌లు.. గొడ‌వ‌లే. దీంతో పెళ్లాన్ని వ‌దిలించుకోవాల‌నుకున్న మ‌ల్లికార్జున్.. ఓ రోజు భార్య ముఖం మీద దిండుతో అదిమి ఆమెను హ‌త్య చేశాడు. మృత‌దేహాన్ని గోనెసంచిలో మూట‌క‌ట్టి డ్రైనేజీలో ప‌డేశాడు. భార్య క‌నిపించ‌టం లేదంటూ ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్లో కంప్లైంట్ ఇచ్చాడు.

మ‌ల్లికార్జున్ తీరు ఎక్క‌డా అనుమానాస్ప‌దంగా లేక‌పోవ‌టం.. రెండో భార్య పేరెంట్స్ కు పెళ్లి స‌మ‌యంలో వారిచ్చిన బంగారం.. న‌గ‌దును వెన‌క్కి ఇచ్చేయ‌టం లాంటివి చేశాడు. కొంత‌కాలం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఐదేళ్ల క్రితం కిరాణా షాపు స్టార్ట్ చేశాడు.

అంద‌రితో స్నేహంగా ఉండ‌టం.. చిన్న చిన్న చేబదుళ్లు తీసుకొని వెంట‌నే ఇచ్చేయ‌టం లాంటివి చేశాడు. దీంతో.. మంచోడిగా పేరు సంపాదించాడు. త‌న‌కు తెలిసిన మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ముఠాగా ఏర్పాటు చేశాడు. అక్ర‌మంగా ఆయుధాల్ని స‌మ‌కూర్చుకున్నాడు. డ‌బ్బులు పెద్ద ఎత్తున తీసుకోవ‌టం.. తిరిగి ఇవ్వాల‌ని అడిగిన వారిని తుపాకీతో బెదిరించేవాడు. దీంతో.. ఇత‌గాడితో ఎందుకొచ్చిన గొడ‌వ అంటూ ఎవ‌రికి వారు వెన‌క్కి త‌గ్గే ప‌రిస్థితి.

అయితే.. త‌మ‌ను దారుణంగా మోసం చేసిన మ‌ల్లికార్జున్ సంగ‌తి చూడాల‌ని భావించిన కొంద‌రు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అక్ర‌మంగా తుపాకీలు ఉన్నాయ‌న్న ఫిర్యాదు నేప‌థ్యంలో విచారించిన పోలీసులు మ‌ల్లికార్జున్ తో స‌హా మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ క్ర‌మంలో విచారించిన పోలీసుల‌కు మ‌ల్లికార్జున్ మాట‌లు అనుమానాన్ని క‌లిగించాయి.

ఇత‌గాడి గ‌త చ‌రిత్ర‌.. కుటుంబ అంశాల మీద దృష్టి సారించారు. దీంతో వారి అనుమానాలుమ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. త‌మ‌దైన శైలిలో విచారించ‌గా.. మ‌ల్లికార్జున్ నోటి వెంట మాట‌లు వ‌చ్చేశాయి. తన రెండో భార్య‌ను ప‌దిహేనేళ్ల క్రితం చంపేసి.. గోనెసంచిలో మూట‌క‌ట్టి డ్రైనేజీలో ప‌డేసిన వైనాన్ని ఒప్పుకున్నాడు. దీంతో.. షాక్ తిన్న పోలీసులు మ‌రింత లోతుగా విచారించ‌గా.. మ‌ల్లికార్జున్ దారుణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొత్తంగా చెప్పేదేమంటే.. అప‌రిచితుల్ని.. పెద్ద‌గా ప‌రిచ‌యం లేని వారిని అంత త్వ‌ర‌గా న‌మ్మొద్దు. మంచిగా ఉంటూనే మొత్తంగా ముంచేసే బ్యాచ్ ఉంటారు సుమా.


Tags:    

Similar News