ఢిల్లీ కేంద్రంగా టీఆర్ ఎస్‌ కు అదిరిపోయే స‌వాల్‌

Update: 2017-12-31 07:36 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇటీవ‌లి కాలంలో పంటికింద రాయిలా మారిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మ‌రోమారు టీఆర్ ఎస్ పార్టీకి ఆస‌క్తిక‌ర‌మైన స‌వాల్ విసిరారు. వ‌ర్గీక‌ర‌ణ చేయ‌కుండా త‌మ‌పై టీఆర్ ఎస్ ఎదురుదాడి చేస్తోంద‌ని ఆరోపించిన మంద‌కృష్ణ ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌ కు ఢిల్లీ వేదిక‌గా సవాల్ విసిరారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్గీకరణ కోసం ఢిల్లీలో దీక్ష చేస్తే టీఆర్‌ ఎస్‌ పార్టీ తమకు మద్దతిస్తుందా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 24 గంటల్లోపు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

కడియం శ్రీహరి మాదిరిగా తామెప్పుడు పదవుల కోసం పాకులాడలేదని మంద‌కృష్ణ మాదిగ అన్నారు. సీఎం కేసీఆర్‌ కు ఎమ్మార్పీఎస్‌ వేసిన 13 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తమ కన్ను తమనే పొడిచేలా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మార్పీఎస్‌ నాయకురాలు భారతి సంస్మరణ సభలో బీజేపీని నిలదీశామని గుర్తు చేశారు. సీపీఐకి ప్రధానమంత్రి అపాయింట్‌ మెంట్‌ దొరికినప్పుడు, బీజేపీకి అండదండగా ఉన్న టీఆర్ ఎస్ పార్టీకి  ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అపాయింట్‌ మెంట్‌ కు టీఆర్‌ ఎస్‌ రాసిన లేఖ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ తనపై కక్షకట్టారని - ఉద్దేశపూర్వకం గానే జైలుకు పంపించారని మంద‌కృష్ణ‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మిలియన్‌ మార్చ్‌ తరహాలో తామేమీ వాహనాలు ధ్వంస్వం చేయలేదని - ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేయలేదని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభలు భజన సభలుగా జరిగాయని అన్నారు.సినిమా హీరోలు కూడా ఎన్టీరామారావును మర్చిపోయి కేసీఆర్‌ ను కొనియాడారని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా..ఎస్సీ రిజ‌ర్వేష‌న్ విష‌యంలో త‌మ‌తో ముడిపెట్టి టీఆర్ ఎస్ పార్టీ విమ‌ర్శ‌లు చేయ‌డంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె లక్ష్మణ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరితే దళితులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని  అన్నారు. ఈ అంశంపై మంత్రి కడియం శ్రీహరి అవగాహనారాహిత్యంతో అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తే...ప్రధాని అపాయింట్‌ మెంట్‌ ఇవ్వలేదనే కుంటిసాకులు సరికాదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్‌ తానే ఆ సీట్లో కూర్చొని మోసం చేశారని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. వారికి కేటాయించిన నిధుల్ని వారికే ఖర్చు చేసేలా చట్టం చేయాలని కోరితే స్పందించట్లేదని మండిప‌డ్డారు.

ఎస్సీ సంక్షేమం కోసం ఎన్నో మాటలు  చెప్తున్న తెలంగాణ‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌... కనీసం ఎస్సీ కమిషన్‌ ను కూడా ఏర్పాటు చేయలేదని - రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఎస్సీ వర్గీకరణకు పూనుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటోందని ఆరోపించారు. జనవరి నుంచి ప్రజాపోరాటాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.
Tags:    

Similar News