బాబు బెదిరింపుల వెనుక మ‌ర్మం ఏంటి?

Update: 2017-07-06 07:03 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ మండిప‌డ్డారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ నెల 7న తలపెట్టిన కురుక్షేత్రం సభకు అనుమతిపై ప్రతిష్టంభన నెలకునేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఏకంగా బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని మండిప‌డ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు రుద్రపాటి బ్రహ్మయ్య హైకోర్టులో తమ సంస్థ 24వ వార్షికోత్సవ సభకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసి సభ నిర్వాహణకు అనుమతి పొందారు. ఈ మేరకు హైకోర్టు నుంచి బ్రహ్మయ్యకు అనుమతి ఉత్తర్వులు అందాయి. హైకోర్టు అనుమతితో సభ నిర్వహిస్తామని మందకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ ఉత్తర్వులు తమకు అందలేదని, అనుమతిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గుంటూరు అర్బన్‌ ఎస్‌ పి విజయరావు తెలిపారు.

మాదిగల వర్గీకరణ చేసి పెద్ద‌మాదిగ‌గా నిలుస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు ఆ ప్ర‌క్రియ‌కు అడ్డుప‌డుతున్నార‌ని మంద‌కృష్ణ  మాదిగ ఆరోపించారు. వ‌ర్గీక‌ర‌ణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరుతూ తలపెట్టిన ఈ సభకు మాదిగ ప్రజాప్రతినిధులను వెళ్లనీవకుండా సీఎం చంద్రబాబునాయుడు బెదిరిస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. పోలీసుల‌ను అడ్డం పెట్టుకొని చంద్ర‌బాబు త‌మ స‌భ‌ను జ‌ర‌గ‌కుండా చూసే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని ఆరోపించారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా కురుక్షేత్రం సభ జరిగిన తీరుతుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు తెలంగాణా ప్రాంతం నుండి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజ‌రు అవుతార‌ని మంద‌కృష్ణ‌ ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు ఎమ్మార్పీఎస్‌ కు పోటీగా మాల‌మ‌హానాడు రంగంలోకి దిగింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్ర‌దేశంలోనే తమ సభకు అనుమతి ఇవ్వాలని మాలమహానాడు నాయకులు పోలీసు అధికారులను కోరారు.  దీంతో ఎవరికీ అనుమతి ఇవ్వరాదనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి నిర్ణయం వస్తే తప్ప తాము నిర్ణయం తీసుకోలేమని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే అనుమ‌తి ఇప్ప‌టికే ఎమ్మార్పీఎస్ స‌భ‌కు అనుమ‌తిరావ‌డం, స‌భ జ‌రిపేందుకు వారు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజరయ్యే అవకాశం ఉంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో సభ జరిగే ప్రదేశాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. మ‌రోవైపు ఈ సభ ఎలా జరుగుతుందోనని ప్రభుత్వ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
Tags:    

Similar News