'మర్రి'కి మరి లేనట్టేనా?

Update: 2022-05-19 02:36 GMT
మర్రి రాజశేఖర్‌కు మరి లేనట్టేనా అని ఇప్పుడు వైఎస్సార్‌సీపీలోనూ, గుంటూరు జిల్లా రాజకీయాల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నుంచి గట్టి హామీ అందుకున్న నేతల్లో మర్రి కూడా ఉన్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ రాజ్యసభకు ఎంపిక చేసిన నలుగురు జాబితాలోనూ మర్రి రాజశేఖర్‌కు చోటు దక్కలేదు. గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గంలో కీలక నేత. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న నేతల్లో ఒకరు. చిలకలూరిపేట నుంచి మూడు సార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన సోమేపల్లి సాంబయ్య మరణించాక ఆయన అల్లుడిగా మర్రి రాజశేఖర్‌ తెరమీదకొచ్చారు.

2004లో నామినేషన్‌ వేయడంలో జరిగిన తప్పిదంతో చిలకలూరిపేట నుంచి ఇండిపెండెంట్‌గా మర్రి రాజశేఖర్‌ పోటీ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆ ఎన్నికల్లో చివరలో ఆయన సీటు దక్కించుకున్నారు. అయితే సాంకేతిక తప్పిదంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఇండిపెండెంట్‌గా మర్రి రాజశేఖర్‌ను పోటీ చేయించింది. తన మద్దతును మర్రి రాజశేఖర్‌కే ప్రకటించింది. చిలకలూరిపేటలో కాంగ్రెస్‌ తరఫున అధికారిక అభ్యర్థిని పోటీలో పెట్టకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న మర్రి రాజశేఖర్‌నే తమ అభ్యర్థి అని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీచిన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌ టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు. ఇక ఆ తర్వాత 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల నుంచి పోటీ చేసిన మర్రి ఓటమి పాలయ్యారు.

ఈ రెండుసార్లు టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఘన విజయం సాధించారు. ఇక 2019లో మర్రికి వైఎస్‌ జగన్‌ సీటు కేటాయించలేదు. మంచి ఆర్థిక బలంతో రంగంలోకి విడదల రజని చిలకలూరిపేట సీటును ఎగరేసుకుపోయారు. అదే ఊపులో ప్రత్తిపాటి పుల్లారావుపై గెలుపొందారు. అంతేకాకుండా ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

అయితే.. మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ గత ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. పలుమార్లు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినా ముక్కూముఖం తెలియని వారందరికీ పదవులు కట్టబెట్టిన జగన్‌ మర్రికి మాత్రం హ్యాండ్‌ ఇచ్చారు. కేబినెట్‌ మంత్రి హోదా ఉన్న ఏ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తారని అనుకున్నా అది కూడా ఇవ్వలేదు.

జగన్‌ను నమ్ముకుని అప్పటి నుంచి చకోర పక్షిలా ఎదురుచూశారు.. మర్రి రాజశేఖర్‌. తాజాగా ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీటుల్లో ఒకటైనా తనకు కేటాయిస్తారని అనుకున్నారు. ఇందులోనూ నిరాశే ఎదురైంది. నాలుగు రాజ్యసభ సీటుల్లో 2 తన సామాజికవర్గం రెడ్లకు, మరో రెండు యాదవులకు కేటాయించారు.. జగన్‌. దీంతో ఇక మర్రి రాజశేఖర్‌కు మరి లేనట్టేనని తెలిసిపోయింది. ఇటీవలే కంటితుడుపు చర్యగా కృష్ణా, ఎన్టీఆర్‌ (ఉమ్మడి కృష్ణా) జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌గా మర్రిని నియమించి చేతులు దులుపుకున్నారు.
Tags:    

Similar News