మాస్క్ ధరిస్తేనే జైళ్లోకి ఎంట్రీ ...ఖైదీలకు తప్పని తిప్పలు !

Update: 2020-03-17 09:15 GMT
కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ ..చైనా దేశాన్ని స్మశానంగా మార్చి , ఆ తరువాత అక్కడి నుండి ఒక్కో దేశం వ్యాప్తి చెందుతూ ..ఇప్పటివరకు 162 దేశాలకి పాకింది. సుమారుగా 7 వేలమందికి పైగా ఈ కరోనా వైరస్ వల్ల మృతిచెందారు. ఇకపోతే, ఈ కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరిగా మారిపోయింది.

ఇకపోతే, కరోనా వైరస్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జైళ్ల శాఖ అప్రమత్తమైంది. జైల్లో వందలాది మంది ఒకేచోట ఉంటారు. కాబట్టి వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు జైళ్ల శాఖ ఖైదీల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర కారాగారాలు అయిన..చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్‌. అలాగే సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా కారాగారాలకు జారీ చేసింది. ముఖ్యంగా కోర్టు విచారణల కోసం జైలు నుండి బయటకి వచ్చి, మళ్లీ జైళ్లోకి వచ్చే ఖైదీలకు ప్రత్యేకంగా జైళ్ల శాఖ మాస్కులు ఇస్తోంది. ఇటు ఖైదీ తో పాటు వచ్చే ఎస్కార్టు సిబ్బందికీ కూడా మాస్కులు ఇస్తున్నారు.

ఇక విచారణ నిమిత్తం జైలు నుండి బయటకి వెళ్లిన ఖైదీలని , కోర్టు వాయిదా తరువాత వారిని నేరుగా జైలులోకి రానీయడం లేదు. వారికి ప్రత్యేకంగా ఒక సబ్బు ఇచ్చి, స్నానం చేసి, దుస్తులు మార్చుకున్నాకే జైలు లోపలికి అనుమతిస్తున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినా, కరోనా లక్షణాలైన విపరీతమైన జ్వరం, జలుబుని గుర్తించేందుకు జైలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇప్పటివరకు ఏ ఖైదీలోనూ కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ , ఒకవేళ ఏవరిలోనైనా కరోనా లక్షణాలు వెలుగుచూస్తే.. వారిని వెంటనే వరంగల్‌ ఎంజీఎం లేదా గాంధీ ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లని సిద్ధం చేసి ఉంచింది.
Tags:    

Similar News