సామ‌ర్ల‌కోట‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ఆరుగురు మృతి

Update: 2018-07-03 04:39 GMT
గ‌డిచిన నెల.. రెండు నెల‌లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘోర రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి.  మృత్యు దేవ‌త ప‌గ‌బ‌ట్టిన రీతిలో సాగుతున్న ప్ర‌మాదాల ప‌రంప‌ర‌లో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా  ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పుగోదావ‌రి జిల్లా సామ‌ర్ల‌కోట ప‌ట్ట‌ణ శివారులో ఘోర రోడ్డు ప్ర‌మాదం

చోటు చేసుకుంది. సోమ‌వారం అర్థ‌రాత్రివేళ చోటు చేసుకున్న ఈ దారుణ ప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా.. మ‌రో 8 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

ఇంత భారీగా ప్రాణాలు పోవ‌టానికి దారి తీసిన కార‌ణాల్ని చూస్తే.. కాకినాడ గ్రామీణ మండ‌లం రామేశ్వ‌రానికి చెందిన 15 మంది పెద్దాపురం మండ‌లం వ‌డ్ల‌మూరులో జ‌రిగిన ఒక పెళ్లికి వెళ్లి ఆటోలో తిరిగి వ‌స్తున్నారు. సాంబ‌మూర్తి రిజ‌ర్వాయ‌ర్ స‌మీపానికి ఆటో చేసుకున్న వేళ‌.. టిప్ప‌ర్ ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటో డ్రైవ‌ర్ తో స‌హా న‌లుగురు మ‌హిళ‌లు.. మూడేళ్ల చిన్నారి ఉన్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఘోర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆటోను ఢీ కొట్టిన టిప్ప‌ర్ ఆప‌కుండా త‌న దారిన తాను వెళ్లిపోయాడు. దీంతో.. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన టిప్ప‌ర్ ను గుర్తించేందుకు నాలుగు బృందాల్ని ఏర్పాటు చేశారు. గంట‌ల వ్య‌వ‌ధిలోనే పోలీసులు టిప్ప‌ర్ ను గుర్తించి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిని పోస్టుమార్టం కోసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి వైద్య సేవ‌ల్ని అందిస్తున్నారు. కేసును న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర‌రోడ్డు ప్ర‌మాదం స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది.
Tags:    

Similar News