మాయావ‌తి ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఉందా మోడీజీ?

Update: 2016-12-27 17:42 GMT
నోట్ల రద్దు త‌ర్వాత‌ బీఎస్పీ ఖాతాలో అక్ర‌మంగా రూ.104 కోట్లు డిపాజిట్ అయ్యాయ‌న్న ఆరోప‌ణ‌ల‌ను బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ఖండించారు.  కేంద్ర ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతోందని మాయావ‌తి ఆరోపించారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ.. యూపీలో బీఎస్పీ ప్ర‌తిష్ట‌ను భంగం క‌లిగించే ప్ర‌య‌త్నం కేంద్రం చేస్తోంద‌ని ఆమె విమ‌ర్శించారు. "మా పార్టీ త‌ర‌పున బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్ర‌తి పైసాకు లెక్క ఉంది. మ‌రి బీజేపీ చేసిన డిపాజిట్ల సంగ‌తేంటి?. ప్ర‌ధానికి ఒక్క‌టే చెప్ప‌ద‌ల‌చుకున్నా. మీకు నీతి - నిజాయితీ ఉంటే.. బీజేపీ చేసిన డిపాజిట్లు - అధిక మొత్తం చేసిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టండి" అని మాయావ‌తి డిమాండ్ చేశారు.

బీఎస్పీ ఖాతాలో అక్ర‌మంగా రూ.104 కోట్లు ఉన్నాయంటూ ఈడీ అధికారులు సీజ్ చేసిన ప్ర‌తి పైసాకు లెక్క ఉంద‌ని, అవి పార్టీ కార్య‌క‌లాపాల కోసం డిపాజిట్ చేసిన మొత్త‌మ‌ని మాయావ‌తి స్ప‌ష్టం చేశారు. అవ‌న్నీ స్వ‌చ్ఛంద విరాళాల‌ని మాయావ‌తి చెప్పారు. తాను ద‌ళితురాలిని కాబ‌ట్టే త‌న‌ను లక్ష్యంగా చేసుకున్నార‌ని ఆరోపించారు. బీజేపీ కూడా డిపాజిట్లు చేసింద‌ని, వాటిపై విచార‌ణ ఎవరు జ‌రుపుతార‌ని ఆమె ప్ర‌శ్నించారు. నోట్ల రద్దు త‌ర్వాత బీఎస్పీ ఖాతాలో రూ.104 కోట్లు డిపాజిట్ చేసిన‌ట్లు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు వెల్ల‌డించారు. మ‌రో రూ.1.43 కోట్లు మాయావ‌తి సోద‌రుడి ఖాతాలో జ‌మైన‌ట్లు గుర్తించారు. ఓ యూనియ‌న్ బ్యాంక్ బ్రాంచ్‌ లో సోదాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఈ వివ‌రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News