దేశంలో ఎమ‌ర్జెన్సీ క‌న్నా ఘోర‌మైన ప‌రిస్థితులు

Update: 2017-09-18 17:12 GMT
ఇటీవ‌లి కాలంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న యూపీ మాజీ సీఎం - బీఎస్పీ అధ్య‌క్షురాలు మాయ‌వ‌తి మ‌రోమారు త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న కామెంట్లు చేశారు. మీరట్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాయావతి మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ఏకంగా దేశంలోనే ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప‌రిస్థితి అయిన ఎమ‌ర్జెన్సీ విధించిన కాలం నాటి కంటే ఘోర‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఆరోపించారు. ద‌ళితులు, మైనార్టీల విష‌యంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.

ద‌ళితుల ప‌ట్ల బీజేపీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతోంద‌ని మాయ‌వ‌తి ఆరోపించారు. అలాంటి అన్యాయాన్ని స‌రిదిద్దేందుకు ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోని సహరన్‌పూర్‌లో దళితులపై దాడుల గురించి మాట్లాడేందుకు రాజ్యసభలో తాను విశ్వ‌ప్ర‌య‌త్నం చేశాన‌ని బీఎస్పీ అధినేత్రి వివ‌రించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తనను మాట్లాడనీయకుండా అడ్డుకుందని ఆరోపించారు. స‌మాజంలో అట్ట‌డుగు వ‌ర్గాలైన ద‌ళితుల‌కు న్యాయం కోసం గ‌ళం విప్ప‌న‌ప్పుడు త‌న‌కు ప‌ద‌వి ఎందుక‌ని భావించే రాజీనామా చేసిన‌ట్లు వివ‌రించారు. దళితులే కాకుండా మెజార్టీగా ఉన్న బీసీల సంక్షేమంపై ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని మాయ‌వ‌తి ఆరోపించారు. ఇవ‌న్నీ చూస్తుంటే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉందని ఆమె విమ‌ర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి స్వ‌తంత్ర‌ సంస్థ‌లను రాజ్యాంగ‌బ‌ద్దంగా ప‌నిచేసుకోనియ‌కుండా విపక్ష నేతల గొంతు నొక్కేందుకు మోడీ సర్కార్ వాడుకుంటోంద‌ని ఆరోపించారు. అయిన‌ప్ప‌టికీ త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

మ‌రోవైపు యూపీ రాజ‌కీయాల‌పైనా మాయా ఘాటుగా స్పందించారు. ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన యూపీ సీఎం యోగీ ఆఖ‌రికి మోసం చేశార‌ని ఆరోపించారు. రైతు రుణ మాఫీ పేరుతో రైతులకు రూ 10 - రూ 100 చెక్‌లు ఇస్తున్నారని పేర్కొన్నారు. చిన్నారుల‌కు ఆక్సిజ‌న్ సౌక‌ర్యం క‌ల్పించలేని ప్ర‌భుత్వం వారి ప్రాణాలు పోయేందుకు కార‌ణం అయింద‌ని దుయ్య‌బ‌ట్టారు.

Tags:    

Similar News