హాజారే దీక్షను మీడియా లైట్ తీసుకుందే?

Update: 2018-03-27 05:08 GMT
కాలం ఎంత సిత్ర‌మైంది?  ఒక‌ప్పుడు ఆయ‌న మాటను బ్యాన‌ర్ వార్త‌. ఇప్పుడు అదే వ్య‌క్తి నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నా ప‌ట్టించుకునే నాథుడే క‌నిపించ‌ట్లేదు. ఒక‌ప్పుడు బ్యాన‌ర్ గా నిలిచిన ఆయ‌న వార్త‌.. నాలుగు రోజుల దీక్ష త‌ర్వాత నాలుగు కేజీల బ‌రువు త‌గ్గినా ఫ‌స్ట్ పేజీలోకి వార్త రాని ప‌రిస్థితి. బ్యాన‌ర్ వార్త కాస్తా సింగిల్ కాల‌మ్ కు ప‌రిమిత‌మైన అన్నా హ‌జారే దీక్షపై మీడియా క‌వ‌రేజ్ చూస్తే.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు మీడియాను ఎంత‌గా ప్ర‌భావితం చేస్తుంటే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

కేంద్రంలో లోక్ పాల్.. రాష్ట్రాల్లో లోకాయుక్తాల‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ల‌తో ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త అన్నాహ‌జారే గ‌డిచిన నాలుగు రోజులుగా నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌ను చేప‌ట్టారు. నాన్ స్టాప్ నిరాహార దీక్ష చేయ‌టంతో ఆయ‌న నాలుగు కేజీల బ‌రువు త‌గ్గారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో హ‌జారే త‌న దీక్ష‌ను ఈ నెల 23 నుంచి స్టార్ట్ చేశారు.

తాజాగా ఆయ‌న చేస్తున్న నిర‌స‌న దీక్ష‌లో లోక్ పాల్ వ్య‌వ‌స్థ ఏర్పాటుతో పాటు.. వ్య‌వ‌సాయోత్ప‌త్తుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌న్న డిమాండ్  ఉంది. దీక్ష‌కు త‌న మ‌ద్ద‌తుదారులు ఢిల్లీకి చేరుకోకుండా రైళ్ల‌ను ర‌ద్దు చేశార‌ని.. హింస‌కు పాల్ప‌డేలా ప్రేరేపిస్తున్నార‌ని ఆరోపించారు.

త‌న చుట్టూ పోలీసుల్ని మొహ‌రించార‌ని.. త‌న‌కు పోలీసుల ర‌క్ష‌ణ అవ‌స‌రం లేద‌ని తాను మొద‌ట్నించి చెబుతున్నాన‌ని.. పోలీసుల్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. త‌న‌కు పోలీసులు అవ‌స‌రం లేద‌ని ప‌లుమార్లు లేఖ‌లు రాసినా.. వెన‌క్కి తీసుకోవ‌టం లేదు. యూపీఏ హ‌యాంలో ఇదే అన్నాహ‌జారే లోక్ పాల్ వ్య‌వ‌స్థ కోసం దీక్ష చేస్తే యావ‌త్ దేశం స్పందించ‌ట‌మే కాదు.. నాటి కేంద్రం గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిన ప‌రిస్థితి. అదే హ‌జారే ఇప్పుడు దీక్ష చేస్తున్నప్ప‌టికీ కేంద్రం కానీ మీడియా కానీ ఆయ‌న దీక్ష‌ను ప‌ట్టించుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News