వైఎస్ ఆద‌ర్శం ఇదేనా? వైసీపీ వైపు విమ‌ర్శ‌ల వేళ్లు!

Update: 2021-11-21 03:30 GMT
ఔను.. ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ముఖ్యంగా ప్ర‌జావేదిక అయిన‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై చ‌ర్చ‌ల‌కు వేదిక అయిన‌.. అసెంబ్లీ రానురాను.. ఉనికిని కోల్పోతోంద‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. రాజ‌న్న రాజ్యంలో ఇలాంటి దూష‌ణ‌లు సాగ‌డం ఏంట‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రాజ‌న్న రాజ్యం ఏర్పాటు చేస్తాన‌ని.. ఇచ్చిన హామీని జ‌గ‌న్ మ‌రిచిపోతున్నా రా? అనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. 2004-2009 వ‌ర‌కు ఉమ్మ‌డి ఏపీలో సీఎంగా వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా దూకుడుగా వ్య‌వ‌హ‌రించార‌ని అయితే.. ఇలా కాద‌ని.. కొంద‌రు గుర్తు చేస్తున్నారు.

నిజానికి చంద్ర‌బాబును టార్గెట్ చేయ‌డంలో.. వైఎస్ అప్ప‌ట్లో చాలా దూకుడుగా ఉండేవార‌ని అంటున్నారు. కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో ఖ‌చ్చితంగా చంద్ర‌బాబును క‌ట్ట‌డి చేసిన ఘ‌న‌త ఆయ‌న‌కు ఉంద‌ని..అయితే ఇలా మాత్రం కాద‌ని.. చెబుతున్నారు. ఏదైనా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసినా..రికార్డుల‌కు అనుగుణంగానే న‌డుచుకున్న సందర్భం ఉంద‌ని చెబుతున్నారు. ఉచిత విద్యుత్ విష‌యంలో చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. ఆ ఉచిత విద్యుత్ ఇస్తే.. క‌రెంటు వైర్ల‌పై బ‌ట్టు ఆరేసుకోవ‌డం త‌ప్ప ఏమీ చేయలేర‌ని.. చంద్ర‌బాబు స‌భ‌లో విమ‌ర్శించిన‌ప్పుడు.. వైఎస్ ప‌ట్ట‌రాని ఆగ్రహంతో ఊగిపోయార‌ని.. అప్ప‌టి స‌భా వ్య‌వ‌హారాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసిన వారు గుర్తు చేసుకుంటున్నారు.

ఎంత ఆగ్ర‌హంతో ఊగిపోయినా.. వైఎస్ ఎప్పుడూ.. హ‌ద్దులు దాట‌లేద‌ని.. రాజ‌కీయంగానే చంద్ర‌బాబును విమ‌ర్శించారు త‌ప్ప‌.. కుటుంబ స‌భ్యుల‌ను కానీ.. ఇత‌ర‌త్రా విష‌యాల‌ను కానీ ప్ర‌స్తావించిన సంద‌ర్బాలు లేవ‌ని.. అంటున్నారు. దీంతో అప్ప‌టి స‌భ 75 శాతం మేర‌కుహుందాగానే న‌డిచింద‌ని చెబుతున్నారు. మ‌రి ఇప్పుడు అదే రాజ‌న్న పేరుతో వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం హ‌ద్దులు మీరుతున్న విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు శాశ్వ‌తం కాద‌ని చెబుతూనే వైసీపీ నాయ‌కులు తెలివిగా చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని ప్ర‌తిప‌క్షాన్ని లేకుండా చేయాల‌నే వ్యూహంతో ముందుకు సాగుతున్నా రా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే.. విశ్లేష‌కులు ఏమంటున్నారంటే.. ఈరోజు చంద్ర‌బాబు విప‌క్షం నుంచి త‌ప్పుకొన్నా.. లేక మ‌రో కార‌ణంగా రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేకుండా పోతుంద‌నే భావ‌న‌ను విడ‌నాడాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌త్యామ్నాయం కోసం.. ప్ర‌జ‌లు ఎదురు చూసే ప‌రిస్థితి వ‌స్తే.. గ‌డ్డి పోచే పెను ఆయుధ‌మైన ప‌శ్చిమ బెంగాల్‌ను గుర్తు చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. కేవ‌లం ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో ప్ర‌స్థానం ప్రారంభించిన అక్క‌డి తృణ‌మూల్‌(గ‌డ్డి పువ్వు) పార్టీ.. క‌మ్యూనిస్టుల కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టిన రాజకీయం గుర్తుచేసుకోవాల‌ని అంటున్నారు. ఈ ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే.. ఖ‌చ్చితంగా సంయ‌మ‌నం.. స‌ర్దుబాటు ధోర‌ణి, ప‌ర‌స్ప‌ర మ‌ర్యాద‌లు వంటి స‌భా సంప్ర‌దాయాల‌ను పాటించాల‌ని సూచిస్తున్నారు. ఈ రోజు చంద్ర‌బాబు అయ్యారు.. రేపు జ‌గ‌న్ కావొచ్చు క‌దా! ఇలాంటి సంప్ర‌దాయాలు మంచివి కావని అంటున్నారు. స‌భ‌లు స‌మావేశాలే కోసం కొలువు తీరాలే త‌ప్ప‌.. స‌మ‌రాల కోసం కాద‌ని అంటున్నారు.
Tags:    

Similar News