లాక్ డౌన్ ఎఫెక్ట్ ..ఇండియాలో 1.85 మిలియన్ల అబార్షన్లకి బ్రేక్!

Update: 2020-07-08 04:00 GMT
కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా చాలా దేశాల్లో బేబీ బూమ్ రావచ్చునన్న అంచనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70లక్షల మంది మహిళలు అవాంఛిత గర్భం దాల్చే అవకాశం ఉందని రెండు నెలల క్రితం యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా చాలామంది భర్తలు ఇళ్లకు పరిమితవడం, వైద్యారోగ్య సదుపాయాలు, గర్భ నిరోధక సాధనాలకు ఆటంకం కలగడంతో ఈ పరిస్థితి తలెత్తవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తాజా పరిస్థితి చూస్తే అది నిజమే అని అనుకోవచ్చు. సాధారణ రోజులతో పోల్చితే లాక్ డౌన్ ‌లో మార్చి 25 నుంచి జూన్ 24 వరకు భారత్‌లో 47శాతం మేర అబార్షన్ల రేటు తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో అయితే ఈ 3 నెలల కాలంలో 3.9మిలియన్ల అబార్షన్లు జరిగి ఉండేవని... కానీ లాక్ డౌన్ కారణంగా 1.85 మిలియన్ల అబార్షన్లు ఆగిపోయాయని ఐపాస్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో 80శాతం మహిళలు.. అంటే,1.5మిలియన్ల మంది లాక్ డౌన్ కారణంగా అబార్షన్ ‌కు సంబంధించిన మెడికల్ డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో అవాంఛిత గర్భం పొందినట్లు తేలింది.

మిగతా 20శాతం మంది మహిళల్లో.. 16శాతం మంది ప్రైవేట్ వైద్య సదుపాయాలు అందుబాటు లేకపోవడంతో,మరో 4శాతం మంది ప్రభుత్వం వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో అవాంఛిత గర్భం దాల్చినట్లు అంచనా వేశారు. ఈ అధ్యయనం కోసం 509 పబ్లిక్ సెక్టార్,52 ప్రైవేట్ సెక్టార్ ప్రొవైడర్స్ ద్వారా 8 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. అలాగే ఫెడరేషన్‌ ఆఫ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల అభిప్రాయాలు,మెడికల్ అబార్షన్ డ్రగ్స్‌కి సంబంధించిన సేల్స్ డేటాను సేకరించారు.
Tags:    

Similar News