విశాఖ రాజధాని కాదుట...రాష్ట్రమేనట !

Update: 2022-12-30 15:43 GMT
అవును. ఈ మాటలు అన్నది ఎవరో రాజకీయంగా పెద్దగా అవగాహన లేని వారు అనుకుంటే పొరపాటు సబ్జెక్ట్ దండీగా ఉన్న సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయనకు అంధ్ర రాష్ట్ర చరిత్ర పూర్తిగా తెలుసు. ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చి ఈ రోజు అమరావతా మూడు రాజధానులా అన్న సంశయం మీద కొట్టుమిట్టాడుతున్నామో ఇంకా బాగా తెలుసు.

ఆయన దీనికి సంబంధించి అనేక ప్రసంగాలు కూడా అసెంబ్లీ లోపలా బయటా చేశారు. అలాంటి ధర్మాన నోటి నుంచి ప్రత్యేక రాష్ట్రం అన్న మాట రావడమే వింతా విడ్డూరంగా ఉంది. మాకు విశాఖను రాజధానిగా వదిలేస్తే ఉత్తరాంధ్రాతో చిన్న రాష్ట్రం గా చేసుకుంటామని ధర్మాన అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇది నిజంగా ఏపీకి గుండెల్లో మంటెక్కించే వార్తే. ఇప్పటిదాకా వైసీపీ పెద్దలు చెబుతూ వస్తున్న దానికి పూర్తిగా భిన్నమైన మాటే. మూడు రాజధానులు మూడు చోట్ల ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఎప్పటికీ కలిసే ఉంటుందని, మళ్ళీ విభజన వాదాలు రావు అని వైసీపీ వారు చెబుతూ వచ్చారు.

ఇంకా ఆలూ లేదు చూలూ లేదు అపుడే మాకు ప్రత్యేక ఉత్తరాంధ్రాను ఏర్పాటు చేసుకుంటామని ధర్మాన అంటున్నారు అంటే ఆలోచించాల్సిందే. నిజానికి మూడు రాజధానుల వల్ల ఇలాంటి సమస్యలే వస్తాయని అంతా చెబుతూ వచ్చారు. మొదట రాజధానితో కధ మొదలవుతుంది ఆ తరువాత అది కాస్తా రాష్ట్రం వేర్పాటుకు దారితీస్తుంది అని అంటారు.

అందుకే చంద్రబాబు కూడా తాజాగా ఉత్తరాంధ్రా జిల్లాల టూర్ లో ఏపీకి ఒకే ఒక రాజధాని అని గట్టిగా స్పష్టం చేశారు. మూడు రాజధానులు వద్దు అని చెప్పారు. కానీ ఇపుడు అదే చంద్రబాబు మాటలను తప్పుపడుతూ సీనియర్ మంత్రి రాష్ట్రం మాకు కావాలని అనడం మాత్రం చర్చకు తావిస్తోంది.

పైగా ధర్మానా అంటోంది మరో మాట ఉంది. మన కళ్లతో మనలను చంద్రబాబు పొడుస్తున్నారు అని. ఉత్తరాంధ్రా వచ్చి విశాఖ రాజధానిని కాదంటారా అని కూడా ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని బట్టి చూస్తే విశాఖ కనుక రాజధాని కాకపోతే ఉత్తరాంధ్రా రాష్ట్రం డిమాండుకు ధర్మాన నేతృత్వం వహించేలా ఉన్నారని అంటున్నారు.

ఏపీ అసలే విభజన సమస్యలతో ఇబ్బంది పడుతోంది. చిన్న రాష్ట్రం అయిపోయింది. దీంతో రాష్ట్రం మళ్ళీ మామూలుగా ఉండాలంటే ఎక్కడో ఒక చోట స్థిరమైన రాజధాని ఉంచుకుని దాని నుంచి ఆదాయం పొందుతూ ఆ ఆదాయంతో ఏపీ అంతా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అన్నదే ఆలోచన కావాలి. కానీ ఇలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం రాష్ట్రం అంటూ వేర్పాటు వాదాన్ని బలపరిస్తే ఎలా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా ధర్మాన మాటలు ఇపుడు చర్చకు తావిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News