అమ‌రావ‌తి డిజైన్లు ఇంకెప్పుడు డిసైడ్ అవుతాయో!

Update: 2017-04-13 05:18 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో భ‌వ‌నాల‌ నిర్మాణాల తీరుపై ఇప్ప‌టివ‌ర‌కు చ‌ర్చ‌లు కొన‌సాగ‌గా ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. రాజ‌ధాని నిర్మాణం అనే ఎపిసోడ్‌లో డిజైన్ల ద‌శ‌లోనే అనేక ట్విస్టులు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో భ‌వ‌నాలకు అత్యుత్త‌మ డిజైన్లు చూస్తున్నాం అనేది అరిగిపోయిన రికార్డేన‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. డిజైన్ల ఖరారులో జాప్యం కారణంగా రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగు ముందుకు ప‌డ‌టం లేదు. త‌ద్వారా రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాలు - ఐకానిక్ భవనాల డిజైన్లు ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవటంతో రాజధాని నిర్మాణ పనులు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న‌ట్లుగా ఉన్నాయి. దీంతో ఎప్పుడు డిజైన్లు ఓకే అవుతాయి...ఇంకెప్పుడు ప‌నులు ప్రారంభం అవుతాయి అనే సందేహాల‌ను ప‌లువురు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

అమ‌రావ‌తి నిర్మాణాల్లో భాగంగా 900 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ - హైకోర్టు - అసెంబ్లీ భవన నిర్మాణాలకు సంబంధించి తొలుత జపాన్‌ కు చెందిన మాకీ సంస్థను కన్సల్టెంట్‌ గా నియమించారు. అయితే ఆ సంస్థ రూపొందించిన డిజైన్లపై ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో కన్సల్టెన్సీని ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా లండన్‌కు చెందిన నార్మన్ పోస్టర్ అనే సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఆ సంస్థ ప్రాథమికంగా 900 ఎకరాల్లో హైకోర్టు - అసెంబ్లీ భవనాలకు సంబంధించి డిజైన్లు రూపొందించి అధికారులకు అందజేసింది. అయితే గతంలో డిజైన్లపై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీనిపై ఆచితూచి వ్యవహరిస్తుండ‌టం ద్వారా ఇది సుదీర్ఘ స‌మ‌యం తీసుకుంటోంది. ఒకవైపు నార్మన్ పోస్టర్ సంస్థ డిజైన్లు సిద్ధం చేస్తున్నప్పటికీ ఐఐటి - ఎన్‌ ఐటి - వివిధ రంగాలకు చెందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో డిజైన్ల ఖరారు ప్రక్రియలో మరింత జాప్యం అనివార్యం కానుంది.

ఈ క్ర‌మంలో తాజాగా ఏపీ పుర‌పాల‌క మంత్రి నారాయ‌ణ‌ - ప్ర‌భుత్వ స‌ల‌హ‌దారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లండ‌న్‌ లో ప‌ర్య‌టిస్తూ నార్మ‌న్ ఫోస్ట‌ర్ డిజైన్ల‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు కొన‌సాగిస్తున్నారు. దీంతో ముందుగా ప్రకటించినట్లు కాకుండా మే నెలాఖరుకు డిజైన్లు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. ఆ తరువాతే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో 2018 నాటికి రాజధాని నిర్మాణం కొలిక్కి రావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News