ఎంపీ వ‌ర్సెస్ మంత్రి.. మ‌హిళా నేత‌ల ఫైటింగ్.. ఎక్క‌డంటే!

Update: 2022-12-05 01:30 GMT
రాజ‌కీయాలు.. రాజ‌కీయాలే. ఎవ‌రైనా.. ఎక్క‌డైనా అధికారం, ఆధిప‌త్య‌మే ముందు.. ప్ర‌త్య‌ర్థులే అయినా.. సొంత పార్టీ నాయ‌కులే అయినా రాజ‌కీయం అంటే రాజ‌కీయ‌మే అని నిరూపిస్తున్నారు తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రు మ‌హిళా నాయ‌కులు. వీరిద్ద‌రు కూడా అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో మంచి పేరున్న నాయ‌కులు కావ‌డం గ‌మ‌నార్హం. అయితేనేం.. వ‌చ్చే ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని.. పొలిటిక‌ల్ పోరుకు దిగిపోయారు. ఒకరిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వారే.. మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎంపీ క‌విత మాలోతు.

నిజానికి ఇద్ద‌రూ కూడా ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. పైగా మంచి ఫైర్ బ్రాండ్ నాయ‌కులుగా స్థానికంగా పేరు తెచ్చుకున్నారు. ఇరువురు కూడా.. మెహ‌బూబాబాద్ జిల్లాకు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. స‌హ‌జంగానే ఒక‌పార్టీలో ఉన్నంత మాత్రాన నాయ‌కులు క‌లిసి ఉండాల‌ని రూలేం లేదు. అలాగ‌ని పోరు పెట్టుకోవాల‌ని కూడా లేదు. కానీ, ఈ ఇద్ద‌రూ పైకి చాలా బాగా క‌లిసి ఉంటారు. కానీ, తెర‌వెనుక మాత్రం రాజ‌కీయ క‌త్తులు నూరుకుంటున్నారు.

స‌త్య‌వ‌తి, క‌విత‌ల గ్రాఫ్ విష‌యాన్ని తీసుకుంటే సీఎం కేసీఆర్ ద‌గ్గ‌ర జోరుగా ఉంది. ఆయ‌న కోసం.. ఒక‌రు పాద‌యాత్ర చేస్తే.. మ‌రొక‌రు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఉద్య‌మాలు చేశారు. దీంతో ఇద్ద‌రి విష‌యంలోనూ కేసీఆర్కు సానుకూల దృక్ఫ‌థ‌మే ఉంది. కానీ, ఎంతైనా వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో వీరి అంత‌రంగ త‌రంగాలు వేరేగా ఉన్నాయి. దీంతో ఆ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ఈ ఇద్ద‌రు మ‌హిళా నాయ‌కులు కూడా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో డోర్న‌క‌ల్ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో స‌త్య‌వ‌తి శ్ర‌మ‌ను గుర్తించిన కేసీఆర్‌.. ఆమెను ఎమ్మెల్సీ చేసి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.  డోర్న‌క‌ల్‌లో ఇప్ప‌టికేరెడ్యానాయ‌క్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం స‌త్య‌వ‌తి రాథోడ్ త‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటుపై బెంగ పెట్టుకున్నారు. డోర్న‌క‌ల్ ఎలానూ రిజ‌ర్వ్ అయిపోయింది కాబ‌ట్టి.. మ‌హ‌బూబాబాద్ అయినా.. ఇవ్వాల‌ని, తెచ్చుకోవాల‌ని భావిస్తున్నారు.

ఇదే.. ఇప్పుడు ఆమ‌కు, ఎంపీ క‌విత‌కు మ‌ధ్య అగాథం పెంచేలా చేస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ టికెట్‌ను వ‌దులుకుని.. మ‌హ‌బూబాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని క‌విత కృత నిశ్చ‌యంతో ఉన్నారు. ఈమె స్వ‌యానా రెడ్యా నాయ‌క్ కుమార్తె కావ‌డం, సీఎం కేసీఆర్ ద‌గ్గ‌ర మంచి ప‌లుకుబ‌డి ఉండ‌డంతో దాదాపు ఆమెకే ఈ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌త్య‌వ‌తి భావిస్తున్నారు. దీంతో  క‌వితపై ప‌రోక్షంగా స‌త్య‌వ‌తి వ్య‌తిరేక ప్ర‌చారం చేయిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక‌, ఈ విష‌యం తెలిసి.. క‌విత కూడా స‌త్య‌వ‌తిపై వ్య‌తిరేక ప్ర‌చారం చేయిస్తున్నారు. దీంతో ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య కోల్డ్ వార్ హీటెక్కుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చివ‌ర‌కు సీఎం కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News