ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన మిథాలీ!

Update: 2017-07-12 16:25 GMT
ఇంగ్లండ్ లో జ‌రుగుతున్న మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంగా భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్(34) ప్రపంచ రికార్డు సృష్టించింది. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌ లో అత్య‌ధిక ప‌రుగులు (6000) సాధించిన తొలి క్రికెటర్‌ గా చ‌రిత్ర‌కెక్కింది. నేడు వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మిథాలీ 34 పరుగులు సాధించి ఈ ఘ‌న‌త ద‌క్కించుకుంది.

అతి తక్కువ మ్యాచ్‌ ల్లో (183 వన్డేలు) ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా మిథాలీ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 41 పరుగులు చేయడం ద్వారా మహిళల వన్డే క్రికెట్‌ లో 6,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌ గా చరిత్రకెక్కింది. 16 ఏళ్ల వ‌య‌సులో 1999లో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌ తో జరిగిన తొలి మ్యాచ్‌ లోనే సెంచ‌రీ చేసింది. అత్యంత పిన్న వ‌య‌సులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిట ఉండటం విశేషం.

మహిళల క్రికెట్‌ లో సచిన్ టెండూల్కర్‌ గా మిథాలీకి పేరుంది. 19 ఏళ్ల వయసులో టాంటన్ వేదికగా ఇంగ్లాండ్‌ తో జరిగిన టెస్టు మ్యాచ్‌ లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌ గా అరుదైన గుర్తింపు సాధించింది. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌ గా పాకిస్థాన్‌ కు చెందిన కిరన్ బలూచ్ పేరిట ఉంది.

ఇదిలా ఉంటే తన 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే వన్డేల్లో వ‌రుస‌గా ఏడు అర్ధ సెంచ‌రీలు చేసిన తొలి క్రికెట‌ర్‌ గా మిథాలీ రికార్డు సృష్టించింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడిన 5 మ్యాచ్ లు ఆడిన మిథాలీ సేన‌ నాలుగు మ్యాచ్ ల‌లో గెలిచింది. ఈ రోజు ఆస్టేలియాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో మిథాలీ సేన‌ 50 ఓవ‌ర్ల‌లో 226 ప‌రుగులు సాధించింది.
Tags:    

Similar News