జ‌గ‌న్‌కు మంత్రి వ‌ర్గం సెగ‌.. మాచ‌ర్ల‌లో అసంతృప్తి మంట‌లు

Update: 2022-04-10 09:12 GMT
వైసీపీ ప్ర‌భుత్వానికి మంత్రి వ‌ర్గ అసంతృప్తుల నుంచి అప్పుడే సెగ‌లు త‌లుగుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జగన్‌ వేస్తున్న కులాల లెక్కలతో సీనియ‌ర్లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ కోసం మేం రెక్క‌లు ముక్క‌లు చేసుకున్నాం.. ఇప్పుడు కులాలు.. మ‌తాలు అంటూ.. మ‌మ్మ‌ల్ని ప‌క్క‌న పెడ‌తారా? అని నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ఎవరిని విస్మరిస్తే ఏం జరుగుతుందో, ఎలాంటి విమర్శలు ఎదురవుతాయో.. ఎలాంటి నిర‌స‌న‌లు చూడాల్సి వ‌స్తుందో అని.. పార్టీ అధిష్టానం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.

అయితే.. అనుకున్న‌ట్టుగానే.. ఇప్పుడు తీవ్ర నిర‌స‌న తెర‌మీదికి వ‌చ్చింది. శనివారం రోజంతా మంత్రివర్గ కూర్పుపై జగన్‌ కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇది ఆదివారం నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగింది. తర్వాత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న నేతలకు జగన్‌ స్వయంగా ఫోన్‌ చేస్తార‌ని.. ఇది జ‌ర‌గ‌డానికి కొన్ని గంట‌ల స‌మ‌య‌మే ఉంద‌ని అనుకుంటుండ‌గా.. పక్క‌నే ఉన్న ప‌ల్నాడు జిల్లాలోని.. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ మంట‌లు రాజుకున్నాయి.

సీఎం జగన్‌ ఎవరిని మంత్రులుగా నియమించాలన్న అంశంపైనే మల్లగుల్లాలు పడుతున్న స‌మ‌యంలో  రాజకీయంగా పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయి. గతంలో జగన్‌ ఏకపక్షంగా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... శిరోధార్యంగా భావించే నేతలు ఇప్పుడు నేరుగా ఆయనముందే అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి కోసం మాచర్ల మున్సిపల్‌ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.

మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న కౌన్సిలర్లు పిన్నెల్లికి మంత్రిపదవి ఇవ్వకుంటే...తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు సమావేశమయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లికి మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణలో పిన్నెల్లికి అవకాశం ఉంటుందా లేదా అనే ఆందోళనతో రాజీనామాలకు సిద్ధమయ్యారు. మరో వైపు ఎమ్మెల్యే పిన్నెల్లి మాచర్ల చేరుకుంటున్నారు. దీంతో ఒక్క‌సారిగా.. రాజ‌కీయ మంట‌లు రాజుకున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News