వైఎస్సార్సీపీలో సీట్స్ ఫర్ సేల్..!

Update: 2018-12-15 12:25 GMT
గత ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అంతర్గతంగా కొన్ని తీవ్రమైన సమస్యలు తలెత్తున్నాయని తెలుస్తోంది. ఒకవైపు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నాలుగేళ్లుగా తీవ్రంగా కష్టపడుతున్నాడు. గత ఏడాదికాలంగా అయితే జగన్ కష్టం మామూలుగా లేదు. తనకు అంత అవసరం లేకపోయినా జగన్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. కుటుంబాన్ని - తన జీవితాన్ని మిస్ అవుతూ జగన్ పాదయాత్రను సాగిస్తూ ఉన్నాడు. బహుశా ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర - ప్రజలతో మమేకం కావడానికి ఇంత కష్టం పడ్డ నేత స్వతంత్ర భారతదేశంలోనే మరెవరూ లేరేమో అనిపించక మానదు. ఇది నాణేణికి ఒక వైపు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాణెనికి మరో వైపు కూడా ఉంది. ఇది జగన్ తర్వాతి శ్రేణి నేతలు చేస్తున్న వ్యవహారం. వైకాపాలో గత కొన్నాళ్లుగా వివిధ నియోజకవర్గాలకు ఇన్ చార్జిలు మారిపోతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇదంతా జగన్ కనుసన్నల్లో జరుగుతోంది అని అంతా అనుకుంటున్నారు. అయితే జగన్ ను కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం మోసం చేస్తూ వైకాపాలో తమ దందాను సాగిస్తున్నారనే సమాచారం అందుతోంది ఇప్పుడు.

జగన్ ను నమ్ముకుని వైకాపాలో కొనసాగిన - కొనసాగుతున్న వారికి అన్యాయం జరిగేలా కొన్ని మార్పులు జరిగాయి. అలాంటి వాటిలో ఒక ప్రముఖమైన ఉదాహరణ చిలకలూరిపేట వ్యవహారం. ఇక్కడ ఇన్నేళ్లుగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మర్రి రాజశేఖర్ ను పక్కన పెట్టి ఇటీవలే విడదల రజనీకి ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటి వరకూ జగన్ ను విమర్శించిన ఆమెకు అక్కడ వైసీపీ టికెట్ ఖరారు అయినట్టే. ఆమె కనీసం వైకాపాలో చేరక ముందే ఆమెకు అక్కడ ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించేసినట్టుగా వార్తలు వచ్చాయి. దాని వెనుక జగన్ కు సన్నిహితుడిగా చలామణి అయ్యే ఒక నేత చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఉత్తరాంధ్ర లీడర్ ఈ వ్యవహారాన్ని నడిపించాడని, రజనీ నుంచి ఐదు కోట్ల రూపాయల మేరకు డబ్బులు తీసుకుని ఆ లీడర్ ఆమెను జగన్ వద్దకు తీసుకెళ్లాడని తెలుస్తోంది. ఆమెతో ఆ భారీ స్థాయి మొత్తాన్ని తీసుకున్న ఆయన జగన్ వద్ద రజనీ గురించి హైప్ ను పెంచాడని .. తెలుస్తోంది. సీనియర్ పొలిటీషియన్ గా ఆయనను నమ్మిన జగన్ అక్కడ ఇన్ చార్జి మార్పుకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పార్టీ కోసం ఇన్నాళ్లూ కష్టపడిన మర్రి రాజశేఖర్ కు అన్యాయమే జరిగింది. పార్టీ కోసం సొంత డబ్బు ను సైతం ఖర్చు పెట్టుకుని ఆయన పని చేశాడు. ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనడం లేదు. ఆయనకు జగన్ వేరే హామీ ఏమిచ్చాడు అనేది తర్వాతి సంగతి. అయితే అక్కడ ఇన్ చార్జిగా కొత్త వ్యక్తి రావడం వెనుక కథే వైకాపాలో ఆందోళన రేపే అంశం.

ఒకవేళ నియోజకవర్గంలో స్థితి గతులను గమనించి ఇన్ చార్జి మార్పు చేస్తే అదో కథ. అయితే.. జగన్ కు దగ్గర మాట చెల్లుబాటు చేసుకోగల ఒక నేత ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని రజనీ నుంచి తీసుకుని ఆమెను అక్కడ ఇన్ చార్జిగా నిలపగలిగాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం అయిన అంశంలా కూడా కనిపించడం లేదు. దాదాపు అరవై అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో ఇలాంటి దందాలు నడుస్తున్నాయని టాక్. వైకాపాలో పెద్దమనుషులుగా చలామణి అయ్యే వాళ్లు ఇలాంటి దందాలను నడిపిస్తున్నారని, కోట్ల రూపాయలు అడుగుతూ.. జగన్ వద్ద మీకు టికెట్ ఇప్పిస్తాం అంటూ వాళ్లు తమ వ్యాపారం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

వైకాపాలోని ఈ సీట్స్ ఫర్ సేల్ కథాకమామీషు గురించి, ఈ వ్యవహారం ఎలా సాగుతోందనే అంశం గురించి తుపాకీ డాట్ కామ్ ముందు ముందు పూర్తి వివరాలు ఇస్తుంది. ఎవరు ఇలాంటి దందాలను నడిపిస్తున్నారనే అంశం గురించి ఆధారాలతో సహా వివరాలను అందిస్తాం. ఈ సీట్స్ ఫర్ సేల్ వివరాలను పూర్తి స్థాయిలో బయటపెడతాం. వెయిట్ అండ్ సీ!


Tags:    

Similar News